బోరుగడ్డకు బిర్యానీ పెట్టించి సస్పెండైన ఏడుగురు పోలీసులు..! ఏం జరిగిందంటే ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికే చుక్కలు చూపిస్తోంది. 50 లక్షలు బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన ప్రభుత్వం.. అనంతరం ఆయనపై మరికొన్ని కేసులు మోపింది. దీంతో ఆయన్ను తాజాగా కోర్టులో హాజరుపర్చి పోలీసులు రిమాండ్ కు తరలించే క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

వైసీపీతో సన్నిహిత సంబంధాలున్న బోరుగడ్డ అనిల్ కుమార్ పై ప్రభుత్వం ఇప్పటికే 17 కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను తాజాగా మంగళగిరి కోర్టులో హాజరు పరిచి అనంతరం రాజమండ్రి సెంట్రల్ తరలిస్తూ ఉండగా మార్గమధ్యలో గన్నవరంలో ఓ రెస్టారెంట్ వద్ద భోజనం కోసం ఆగారు. గన్నవరంలోని క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ లో అనిల్ కు పోలీసులు రాచ మర్యాదలు చేశారు. ఆయనతో కలిసి ఏడుగురు పోలీసులు బిర్యానీ తిన్నారు. అదే సమయంలో సెల్ ఫోన్ లో ఈ వీడియో తీస్తున్న పలువురు టీడీపీ కార్యకర్తల పోన్లు లాక్కుని వీడియో డిలీట్ చేశారు.
దీంతో టీడీపీ నేతలు ఈ వ్యవహారాన్ని పార్టీ పెద్దల వద్దకు తీసుకెళ్లడం,వారు పోలీసు ఉన్నతాధికారుల్ని అలర్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ అదేశాలు వచ్చాయి.
బోరుగడ్డతో పాటు బిర్యానీ పార్టీలో పాల్గొన్న ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వీరంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. రిమాండ్ ఖైదీకి కోరిన భోజనం పెట్టాలని నిబంధనలు ఉన్నాయని, అందుకే తాము బిర్యానీ భోజనం పెట్టించినట్లు వారు చెబుతున్నట్లు తెలుస్తోంది.
కానీ టీడీపీతో పాటు అధికార కూటమి పార్టీల నేతలు మాత్రం వైసీపీ హయాంలో తమను ఇష్టారాజ్యంగా తిట్టి, బ్లాక్ మెయిల్ చేసిన బోరుగడ్డ అనిల్ వంటి రౌడీ షీటర్ ను తమ ప్రభుత్వంలో కూడా ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రదానంగా పోలీసులే కారణమని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి బోరుగడ్డతో అంటకాగుతున్న పోలీసులపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications