రేపు సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు-ఏపీ డీజీపీ హెచ్చరిక..!
ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. ఇందుకోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కౌంటింగ్ సమయంలో ఎవరూ వ్యవహరించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో కీలక హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రెచ్చిపోయే పార్టీల కార్యకర్తలకు, సానుభూతిపరులకు ఈ హెచ్చరికలు చేశారు.
కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు డీజీపీ తెలిపారు. రెచ్చగొట్టే పోస్టులపై, వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో గీత దాటితే చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతున్నారని, అలాంటి బెదిరింపులపై కఠినంగా ఉంటామన్నారు.

సోషల్ మీడియాలో కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై కతిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. వీరిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని, రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలిపారు. పీడీ యాక్ట్ ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామన్నారు. రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం, షేర్ చేయడం కూడా నిషిద్ధమన్నారు. గ్రూప్ అడ్మిన్ లు ఈ విషయంలో అలెర్ట్ గా ఉండాలన్నారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications