వైసీపీ పోస్టులు పెడితే అక్కడి నుంచి జీతాలు..! వెలుగులోకి మరో స్కాం ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి ప్రభుత్వం నుంచి ఎలా జీతాలు అందేవో తాజాగా వెల్లడైంది. ఏపీ డిజిటల్ కార్పోరేషన్ నిధుల్ని వైసీపీ సానుభూతిపరులకు ఎలా పంచిపెట్టారో తాజాగా పోలీసులు వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ డిజిటల్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు, వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం దీని ఉద్దేశం. అయితే వీటితో పాటు విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై, ఇంకా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనా ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టే వారిని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెట్టే వారిని డిజిటల్ కార్పోరేషన్ జీతాలు చెల్లించి మరీ ప్రోత్సహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
తాజాగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో వర్రా రవీందర్ రెడ్డి వైసీపీ తరఫున పోస్టులు పెట్టినందుకు ప్రభుత్వం నుంచి జీతం అందుకున్నట్లు తేలిందన్నారు. ఇలా పలువురు వైసీపీకి అనుకూలంగా, విపక్ష నేతలపై బురద జల్లుతూ బూతులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి డిజిటల్ కార్పోరేషన్ జీతాలు తీసుకున్నట్లు తేలిందన్నారు. దీన్ని బట్టి చూస్తే డిజిటల్ కార్పోరేషన్ ద్వారా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు జరిగిన చెల్లింపుల వివరాలపై ప్రభుత్వం పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ వివరాలన్నీ లభిస్తే ఇదో పెద్ద స్కాం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications