అడ్డంగా నరికేస్తారా?: టిపై బాబు, మోడీ వైపు ప్రజలు
హైదరాబాద్: విభజన అంశాన్ని టేబుల్ ఐటంగా పెట్టి తమను అడ్డంగా నరికేస్తారా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రశ్నించారు. విభజన అంశంపై చంద్రబాబు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. విభజన అంశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపించారు. అందరికీ ఆమోదయోగ్య పరిష్కారమని చెప్పిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట తప్పారన్నారు.
371డి అధికారణాన్ని వక్రీకరిస్తున్నారన్నారు. అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఏ చట్టం కింద హైదరాబాదును ఉమ్మడి రాజధాని చేస్తున్నారో చెప్పలేదన్నారు. నీరు, హైదరాబాదు పైన కేంద్రం పెత్తనం చేయాలని చూస్తోందని, హైదరాబాదు విషయంలో ఎలాంటి స్పష్టత లేదన్నారు.

కాంగ్రెసు పార్టీ తమను మోసం చేసిందని స్వయంగా కేంద్రమంత్రులే అంటున్నారన్నారు. అలాంటి కేబినెట్ నిర్ణయాన్ని రాష్ట్రపతి గౌరవిస్తే ఎలా అని అభిప్రాయపడ్డారు. విభజన ప్రభావం దేశం పైన ఉంటుందన్నారు. తప్పులు సవరించాకనే రాష్ట్ర విభజనపై ముందుకు వెళ్లాలని సూచించారు.
కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు మాట్లాడుతూ.. దేశానికి పట్టిన కాంగ్రెసు శని వదిలిందన్నారు. కాంగ్రెసు కూడా ఈ ఫలితాలను స్వాగతించాల్సిందేనన్నారు. భవిష్యత్తులో అవినీతిపరులకు ఇదే గతి పడుతుందన్నారు. నరేంద్ర మోడీని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారన్నారు. సుపరిపాలన, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని, టిడిపిది కూడా సుపరిపాలనే అన్నారు. కాంగ్రెసు వెంటి లెటర్ పైన ఉందని, ముందస్తు వస్తే చనిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications