ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూల్ వచ్చేసింది..మార్చి 30 నుంచి పరీక్షలు..
ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూల్ వచ్చేసింది..మార్చి 30 నుంచి పరీక్షలు : హైకోర్టు ఆదేశాలతో డీఎస్సీ పరీక్ష నిర్వహణకు కొత్త తేదీలను అధికారులు ప్రకటించారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. మార్చి 25 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు టెట్, డీఎస్సీకి మధ్య నాలుగు వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన క్రమంలో విద్యాశాఖ అధికారులు డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను మార్చినట్టు తెలిపారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా ఎస్జీటీ పోస్టులకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్షను నిర్వహించనున్నారు. ఇక, వచ్చే నెల13 నుంచి 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, పీఈటీ, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు జరుగుతాయి. మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక ఈ నెల 25 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తున్నామన్నారు.

అభ్యర్థుల అభ్యర్థన మేరకు : విద్యాశాఖ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, టెట్, డీఎస్సీల మధ్య గడువు విషయంలో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో, టెట్ పరీక్షలు ముగిసిన మర్నాడే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారని, అభ్యర్థులు పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు సమయం లేదని, షెడ్యూల్ మార్చేలా ఆదేశాలు జారీచేయాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని ఈనెల 4 వ తేదీన తీర్పు ఇచ్చింది. దీంతో విద్యాశాఖ డీఎస్సీ షెడ్యూల్‌లో పలు మార్పులు చేసింది.












Click it and Unblock the Notifications