ఇద్దరు సీఎంలతో మాట్లాడే టైం దొరకలేదన్న గవర్నర్
హైదరాబాద్: ఇద్దరు ముఖ్యమంత్రులతో భేటీకి తాను ప్రయత్నిస్తున్నానని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆదివారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పలు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఎంసెట్ కౌన్సెలింగ్ అంశాన్ని వారు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు సీఎంలతో భేటీకి ప్రయత్నిస్తున్నానని గవర్నర్ వారితో అన్నారట.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎంసెట్ కౌన్సెలింగ్ ఉమ్మడిగానే జరగాలని, విద్య అనేది పదేళ్ల పాటు ఉమ్మడి అంశంగానే ఉంటుందని వారు గవర్నర్‌కు గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేయడం చట్ట విరుద్దమని ఫిర్యాదు చేశారు.

సోమవారం సుప్రీం కోర్టులో కేసు విచారణకు రానున్న సమయంలో ఇప్పటికిప్పుడు హడావుడిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కోరారు.
రెండు రాష్ట్రాల సీఎంను ఒకేచోట కూర్చోబెట్టి మాట్లాడాలని అనుకున్నానని, రాష్ట్రపతి వచ్చిన సందర్భంగా ఈ పని చేయాలనుకున్నా.. ముగ్గురం కలిసి ఉన్నది కొద్దిసేపేనని గవర్నర్ వారితో చెప్పారట. ఇద్దరినీ కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామనుకుంటే అవకాశం దొరకలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సుప్రీం తీర్పు వస్తుందని, ఆ తీర్పు స్పష్టంగా ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండదని, దానిని అమలు చేయవచ్చని గవర్నర్ చెప్పారట.












Click it and Unblock the Notifications