ఏపీలో ఒంటి పూట బడులు ఎప్పుడు ?- ప్రశ్నించిన టీచర్లపై బొత్స ఫైర్ ? మీకా..పిల్లలకా ?
విజయనగరం : ఏపీలో ఒంటిపూట బడులపై ప్రభుత్వం మౌనం వహిస్తోంది. ఇప్పటికే మార్చి నెల పూర్తవుతోంది. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ప్రతీ ఏటా ఫిబ్రవరి 15 తర్వాత ఎప్పుడైనా ఒంటిపూట బడులు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది మాత్రం ఒంటిపూట బడులపై ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. దీనిపై ప్రశ్నించిన టీచర్లపైనా విద్యామంత్రి బొత్స సత్యనారాయణ భగ్గుమన్నట్లు తెలుస్తోంది.
తాజాగా రాష్ట్రం లో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించండని ఉపాధ్యాయులు విజయనగరం పర్యటన లో ఉన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ను కోరారు. దీంతో ఆయన టీచర్లపై అసహనంవ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పిల్లలకా, మీకా అని వారిపై అసహనం వ్యక్తం చేసినట్లు టీచర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకూ ఒంటిపూట బడులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోగా..అడిగిన టీచర్లపై బొత్స చిర్రుబుర్రులాడటం వివాదాస్పదమైంది.

ఒంటిపూట బడులపై ప్రశ్నించిన టీచర్లపై విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల పట్ల వ్యతిరేక ధోరణి పక్కనపెట్టి విద్యార్థుల సంక్షేమం దృష్టిలో లో ఉంచుకొని ఒంటి పూట బడుల నిర్వహణకు ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు.
మరో నెల రోజుల్లో విద్యాసంవత్సరం ఎలాగో ముగియబోతోంది. ఈ ఏడాది ఎండలు కాస్త తక్కువగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఒంటిపూట బడుల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు టీచర్ల వ్యవహారంలో ప్రభుత్వం ఆగ్రహంగా ఉండటం వల్లే ఒంటిపూట బడులపై ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications