ఏపీలో టీచర్ల జీతాలు అప్పుడే-ఆలస్యానికి కారణమిదేనన్న మంత్రి బొత్స...
ఏపీలో ఈ నెల ఒకటో తేదీన జమకావాల్సిన జీతాలు అక్కడక్కడా ఆలస్యం అవుతున్నాయి. దీంతో సదరు ఉపాధ్యాయులు జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ గురుపూజోత్సవం కావడంతో టీచర్ల జీతాలపై మరోసారి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. టీచర్ల జీతాల ఆలస్యానికి దారి తీసిన కారణాన్ని వెల్లడించారు.
విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర గురుపూజోత్సవంలో పాల్గొన్న మంత్రి బొత్సకు టీచర్ల వేతనాల ప్రశ్న ఎదురైంది.ఏపీలో టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదని కొందరు విమర్శిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు.సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యం అయ్యాయని ఆయన తెలిపారు. కాబట్టి ఈ నెల 7న లేదా 8వ తేదీల్లో టీచర్ల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తామని బొత్స తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా ఇవాళ ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి బొత్స పురస్కారాలు అందించారు.

రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు లేవని, దీనిపై గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని మంత్రి బొత్స విమర్శించారు. ప్రస్తుతం నియామకాలపై సీఎం జగన్ దృష్టి పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో 3,200 పోస్టులు భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు బొత్స వెల్లడించారు. నెల రోజుల్లో అన్ని వర్సిటీల్లో నియామకాల ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణల ఫలితాలను కూడా బొత్స వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ముందు సీట్లు లేవనే బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందని బొత్స గుర్తుచేశారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని తెలిపారు. ఏపీలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను పరిశీలించాలని నీతి ఆయోగ్ కూడా చెబుతోందన్నారు. ప్రధాని మోదీ కూడా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలను ప్రశంసించారని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications