AP Election: రేపు ఏపీలో అమిత్ షా ప్రచారం- ఎల్లుండి ప్రధాని మోడీ..!
ఏపీలో విపక్ష ఎన్డీయే కూటమి తరఫున ప్రచారానికి అగ్రనేతలు రాబోతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కాగా.. తాజాగా హోంమంత్రి అమిత్ షా టూర్ కూడా ఖరారైంది. అయితే ప్రధాని మోడీ కంటే ముందే అమిత్ షా రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. రేపు రాయలసీమలోని ధర్మవరం నియోజకవర్గానికి అమిత్ షా రాబోతున్నారు. కూటమి తరఫున పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు మద్దతుగా అమిత్ షా ఇక్కడ ప్రచారం చేస్తారు.
రేపు ధర్మవరానికి అమిత్ షా వస్తున్నట్లు తమకు సమాచారం అందినట్లు రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు ధర్మవరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ధర్మవరానికి చేరుకోనున్న అమిత్ షా.. సత్యకుమార్ కు మద్దతుగా ధర్మవరం బత్తలపల్లి రోడ్డు లోని సీఎన్బీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అమిత్ షాతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ సభలో పాల్గొంటారు.

మరోవైపు ప్రధాని మోడీ ఎల్లుండి రాష్టానికి రాబోతున్నారు. మే 6వ తేదీన ఢిల్లీ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు రానున్న ప్రధాని మోడీ..మధ్యాహ్నం 3 గంటలకు సభా వేదిక ఏర్పాటు చేస్తున్న వేమగిరికి చేరుకుని సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరితో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి అనకాపల్లి వెళతారు. అక్కడ రాత్రి బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు.
అనంతరం తిరిగి మే 8వ తేదీన రానున్న ప్రధాని మోడీ.. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి పీలేరు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చి విజయవాడకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకూ చంద్రబాబు, పవన్ తో కలిసి రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఢిల్లీ వెళ్లిపోతారు.












Click it and Unblock the Notifications