చంద్రబాబు దగ్గరికెళ్తే ఇక కనిపించవు! ఉద్యోగ నేతకు ఐపీఎస్ ల బెదిరింపులు?
ఏపీలో ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపులకు పాల్పడిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ తాజాగా సస్పెండైన ఇద్దరూ కీలక ఐపీఎస్ అధికారులు మరో వివాదంలో చిక్కున్నారు. వారిపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న వీరిపై ఆయన ఫిర్యాదు చేయబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే ప్రభుత్వం వీరిపై మరిన్ని అభియోగాలు మోపే అవకాశాలున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో సీఎం జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతే కాదు సంక్షేమ పథకాలకు డబ్బు చాలక ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము కూడా వాడేసే పరిస్ధితి వచ్చింది. దీనిపై అప్పటి గవర్నర్ హరిచందన్ కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఇది ప్రభుత్వానికి మంట పుట్టించింది. దీంతో సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగారు.

గవర్నర్ కు తాను ఇచ్చిన ఫిర్యాదు తర్వాత అప్పటి వైసీపీ సర్కార్ తనపై దొంగ కేసులు బనాయించిందని ఉద్యోగ సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ తాజాగా ఆరోపించారు. తనపై తప్పుడు కేసు పెట్టి ఆరెస్టు చేసేందుకు ప్రయత్నించారని, బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్తే జగన్ స్వయంగా రంగంలోకి దిగి అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. ఇందుకోసం ప్రభుత్వ సొమ్ము రూ.25 లక్షలు ఖర్చు చేశారన్నారు. దీన్ని ప్రస్తుత ప్రభుత్వం రికవరీ చేయాలని ఆయన కోరుతున్నారు.
ఎట్టకేలకు సుప్రీంకోర్టులో తనకు బెయిల్ లభించినా పటమట పీఎస్ కు డీసీపీ విశాల్ గున్నీ పిలిపించి ఇంటెలిజెన్స్ ఛీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడించారని ఉద్యోగ నేత తెలిపారు. వీరిద్దరూ కలిసి తాను అప్పటి విపక్ష నేత చంద్రబాబును కలిస్తే కనిపించనివ్వకుండా చేస్తామంటూ బెదిరించారని కేఆర్ సూర్యనారాయణ ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు కేఆర్ సూర్యనారాయణ వీరిద్దరిపై మరో ఫిర్యాదు చేయబోతున్నారా అన్న చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications