
రాయలసీమ లిఫ్ట్ కు కౌంటర్ -పాలమూరును టార్గెట్ చేసిన ఏపీ-ఎన్టీటీకి ఫిర్యాదు
రాయలసీమ లిఫ్ట్ ను వ్యతిరేకిస్తూ వాటర్ వార్ ప్రారంభించిన తెలంగాణ సర్కార్ కు ఏపీ రైతులు దీటుగా బదులిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల్ని అక్కడి హైకోర్టులోనే సవాల్ చేసిన ఏపీ రైతులు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని టార్గెట్ చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ లో ఫిర్యాదు చేశారు.
Recommended Video
రాయలసీమ, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన రైతులు తెలంగాణ సర్కార్ నిర్మిస్తున్న పాలముూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఇవాళ జాతీయ హరిత ట్రైబ్యునల్ లో ఫిర్యాదు చేశారు. గతంలో పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ తాగునీరు కోసమే ఈ ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పిన తెలంగాణ సర్కార్.. ఇప్పుడు సాగునీటి అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మిస్తోందని రైతులు ఫిర్యాదు చేశారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం గత ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు.

పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ నిర్మించడం ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని ఏపీ రైతులు ఎన్జీటీలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ ఈ ప్రాజెక్టు నిర్మించకుండా అడ్డుకోవాలని కోరారు. అంతే గాకుండా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారో లేదో సమీక్షించేందుకు ఎన్టీటీ నిపుణుల కమిటీని నియమించాలని కూడా కోరారు. దీనిపై విచారణను జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగస్టు 29కి వాయిదా వేసింది.