రేపు ఏపీ స్కూళ్లలో పిల్లలకు ఈ ఉచిత ట్యాబ్లెట్ల పంపిణీ...
ఏపీలోని అన్ని పాఠశాలల్లో రేపు ప్రభుత్వం విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్లెట్లను పంపిణీ చేయబోతోంది. జాతీయ నులి పురుగుల నిర్మూల దినోత్సవం సందర్భంగా విద్యార్దుల్ని ఆరోగ్యవంతంగా ఉంచే ఈ ట్యాబ్లెట్లను పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 10వ తేదీన ఓసారి తొలి డోస్ పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు రేపు అంటే గురువారం రెండో డోస్ పంపిణీకి సిద్ధమవుతోంది. ఈ మేరకు స్కూళ్లకు ఈ ట్యాబ్లెట్లను వైద్యారోగ్యశాఖ పంపుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లకు వెళ్తున్న విద్యార్దుల్లో చాలా మంది కడుపులో నులిపురుగులు, రక్తహీనత సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లలు తినే ఆహారాన్ని కడుపులో నులిపురుగులు తినేస్తుండటంతో విద్యార్ధుల్లో పెరుగుదలతో పాటు ఇతరత్రా సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం నులి పురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లలందరికీ ఆల్పెండజోల్ మాత్రలు రెండు డోసులుగా పంపిణీ చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఈ నెల 10న ఓ దశ ఆల్పెండజోల్ మాత్రల్ని అన్ని స్కూళ్లలో విద్యార్ధులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. రేపు మరోసారి 4 లక్షల మంది విద్యార్ధులకు ఈ మాత్రలు పంపిణీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం మాప్ అప్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఉచితంగా మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ తెలిపారు. ఈనెల 10వ తేదీన 1-19 మధ్య వయసు వారికి కోటీ 6 లక్షల ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రలు ఉచితంగా పంపిణీ చేసినట్లు కమిషనర్ తెలిపారు.
ఇంకా మిగిలిపోయిన 4 లక్షల మందికి ఈనెల 17న నులిపురుగు మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.
పిల్లల్లో నులిపురుగులు, రక్తహీనత నివారణకు ఈ మాత్రను తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. పిల్లలు తిన్న ఆహారం వంటపట్టేందుకు ఈ మాత్ర ఎంతగానో పనిచేస్తుందన్నారు. మధ్యాహ్నం భోజనం చేశాక ఒక మాత్రను ఒకసారి మాత్రమే వేసుకోవాలని సూచించారు. 1-2 మధ్య వయసు గల పిల్లలు సగం మాత్రను వేసుకోవాలని, 2-19 మధ్య వయసున్న పిల్లలు మొత్తం మాత్రను వేసుకోవాలని కమిషనర్ తెలిపారు.












Click it and Unblock the Notifications