ఏపీలో అంగన్ వాడీల జీతాలు పెంపు ఎప్పుడంటే ? తేల్చేసిన సజ్జల..!
ఏపీలో అంగన్ వాడీ వర్కర్లు గత కొంతకాలంగా సమ్మెలో ఉన్నారు. దాదాపు ప్రతీ జిల్లాల్లోనూ అంగన్ వాడీ వర్కర్లు రోడ్డెక్కడమే కాకుండా మంత్రులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను ఘోరావ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వీరి ప్రధాన డిమాండ్లను నెరవేర్చామని, జీతాల పెంపు మాత్రమే మిగిలుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినా వీరు విధుల్లో చేరకపోవడంతో నిన్నటి నుంచి వీరిపై ఎస్మా కూడా ప్రయోగిస్తున్నారు.
ఏపీలో అంగన్ వాడీ కార్మికుల జీతాల పెంపు డిమాండ్లపై ఇప్పటికే పలుమార్లు నిస్సహాయత వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇవాళ మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చారు. అంగన్ వాడీల వేతనాల పెంపు ఎన్నికల్లోపు లేదని ఆయన తేల్చిచెప్పేశారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అంగన్ వాడీల వేతనాలు పెంచలేమని ఆయన తెలిపారు. ఎన్నికల తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

అంగన్ వాడీల సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంపైనా సజ్జల స్పందించారు. అంగన్ వాడీల విధులు అత్యవసరం కాబట్టి వారి సమ్మెపై ఎస్మా ప్రయోగించినట్లు సజ్జల వెల్లడించారు. అలాగే ప్రభుత్వం అంగన్ వాడీల సమ్మెకు ప్రత్యామ్నాయంగా చేపడుతున్న చర్యల్ని అడ్డుకునే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమ్మెలో ఉన్న అంగన్ వాడీలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటే వారికే నష్టమని సజ్జల తెలిపారు. మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మెపైనా సజ్జల స్పందించారు. వారితో ఇంకా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. పురపాలక కార్మికులపై మాత్రం ఎస్మా ప్రయోగించే అవకాశం లేదని సజ్జల స్పష్టత ఇచ్చారు.












Click it and Unblock the Notifications