విజయవాడలో హోటల్స్, రెస్టారెంట్స్ కు సర్కార్ శుభవార్త..!
ఏపీలో రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ నగరంలో అర్ధరాత్రి ఫుడ్ లవర్స్ కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో బస్సులు, రైళ్లలో నగరానికి చేరుకుని తిండి కోసం అల్లాడుతున్న ప్రయాణికులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల్ని సర్కార్ అంగీకరించింది.
విజయవాడలో గతంలో అర్ధరాత్రి కూడా పనిచేసేలా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. కానీ వాటి వల్ల ఎదురవుతున్న సమస్యలతో వీటి ప్రభావం తగ్గిపోయింది. అదే సమయంలో విజయవాడ నగరంలో ఫుడ్ కోర్టులకు వెళ్లాలంటే ఆటోలు, ఇతర వాహనాలు దొరకని పరిస్ధితి. దీంతో అర్ధరాత్రి నగరానికి వచ్చే వారు ఇబ్బందులు పడే వారు. ఈ నేపథ్యంలోనే తమకు అర్ధరాత్రి 12 గంటల వరకూ హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వాటి యజమానులు కోరుతున్నారు.

దీనికి ప్రభుత్వం తాజాగా ఆమోద ముద్ర వేసింది. అర్ధరాత్రి 12 గంటల వరకూ విజయవాడ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎక్కడైనా అర్ధరాత్రి కూడా హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులపై వాటి యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో విజయవాడ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 గంటలకే మూసేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం మరో రెండు గంటలు సమయం పెంచడంతో ఆ మేరకు హోటల్స్, రెస్టారెంట్లు నడుపుకునేందుకు వాటి యజమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications