ఏపీలో జీతాలు,పెన్షన్లపై ఆర్ధిక శాఖ కీలక ఆదేశం-డీఏ జీవో సవరణ వేళ..!
ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏ బకాయిల్ని విడుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీన్ని గతేడాది జనవరి 1 నుంచి వర్తింపచేస్తూ తాజాగా ఉత్తర్వులు కూడా ఇచ్చింది. డీఏ బకాయిల్ని రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే ప్రయోజనాలతో కలిపి ఇచ్చేలా జీవో జారీ చేసింది. దీనిపై ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు రావడంతో జీవోలో మార్పులు చేసి మరో కొత్త జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్థికశాఖ ట్రెజరీలకు మరో ఉత్తర్వు జారీ చేసింది.
తాజాగా ప్రభుత్వం రిటైర్ మెంట్ సమయంలో డీఏ బకాయిలు చెల్లించాలని ఇచ్చిన ఉత్తర్వుల స్ధానంలో సవరించిన జీవో ఇచ్చారు. ఇందులో డీఏ బకాయిల్లో 10 శాతం వచ్చే ఏడాది ఏప్రిల్ లో చెల్లిస్తామని, మిగిలిన 90 శాతం బకాయిలు 3 వాయిదాల్లో చెల్లిస్తామని ఇందులో హామీ ఇచ్చింది. అలాగే ఓపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిల్ని జీపీఎఫ్ ఖాతాకు జమ చేయాలని, సీపీఎస్, పీటీడీ ఉద్యోగులకు 90 శాతం బకాయిలు నగదు రూపంలో ఇస్తామని తెలిపింది.

అయితే తాజా జీవో జారీకి ముందు పాత జీవో ప్రకారం ఉద్యోగుల జీతాల బిల్లుల్ని, పెన్షనర్ల పింఛన్ బిల్లుల్లో కొన్నింటిని ట్రెజరీలు ఆర్ధిక శాఖకు సమర్పించాయి. ఇప్పుడు కొత్త జీవో జారీ కావడంతో దాని ప్రకారం తిరిగి ఆయా బిల్లులు మళ్లీ సమర్పించాలని ఆర్థికశాఖ ఇవాళ ట్రెజరీలకు ఆదేశాలు ఇచ్చింది. డీఏ విడుదలకు ముందే సబ్మిట్ చేసిన బిల్స్ రిటర్న్ చేసి.. మరల కొత్త డీఏతో జీతపు బిల్లులు సబ్మిట్ చేయాలనీ జిల్లా ట్రెజరీ అధికారులకు ఆర్థికశాఖ సూచించింది.

ఈ నేపథ్యంలో ట్రెజరీలు ఉద్యోగుల జీతాల బిల్లుల్ని, పెన్షన్లర్ల పెన్షన్ బిల్లుల్ని తిరిగి ఆర్థికశాఖకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నాయి. డీఏ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం తొలుత జారీ చేసిన ఉత్తర్వులపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు తాజా జీవోపై మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆర్థికశాఖ చర్యల్ని వేగవంతం చేస్తుండటంతో వారికి త్వరలోనే ఈ ప్రయోజనం చేకూరనుంది.












Click it and Unblock the Notifications