Mobile phones Ban : ఏపీ స్కూళ్లలో సెల్ ఫోన్ నిషేధం- విద్యార్ధులకు పూర్తిగా.. టీచర్లకు ఇలా..
ఏపీలోని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దులు, ఉపాధ్యాయుల విచ్చలవిడి ఫోన్ల వాడకంపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం విద్యార్దులు, టీచర్లు పాటించాల్సిన నిబంధనల్ని ప్రభుత్వం విడుదల చేసింది. వీటిని తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. దీంతో ఇకపై స్కూళ్లలో మొబైల్ ఫోన్స్ వాడకం తగ్గిపోనుంది.

ఏపీ స్కూళ్లలో విద్యార్దులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది సెల్ ఫోన్ల వాడకంపై ఎప్పటి నుంచో ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం తాజాగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించింది. స్కూళ్లపై సెల్ ఫోన్ల వాడకం అవసరంపై సమగ్రంగా అధ్యయనం చేసింది. అనంతరం స్కూళ్లలో సెల్ ఫోన్లు నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం విద్యార్దులకు పూర్తిగా సెల్ ఫోన్ తీసుకురావడం కానీ, వాడడం కానీ నిషేధించారు.
అయితే టీచర్ల విషయంలో సెల్ ఫోన్ నిషేధం పూర్తిగా అమలు అయ్యే అవకాశాలు లేవు. దీనికి కారణం ప్రభుత్వం ఇప్పటికే వారికి సెల్ ఫోన్లలో యాప్ లు ఇచ్చి వాటిలోనే హాజరు నమోదు చేయాలని కోరడమే. అలాగే స్కూళ్లలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోల్ని సెల్ ఫోన్ లోని యాప్ లలో అప్ లోడ్ చేయాలని ఆదేశాలు ఇచ్చి ఉండటమే. దీంతో ఉపాధ్యాయులపై సెల్ ఫోన్ల నిషేధాన్ని పాక్షికంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
టీచర్లు స్కూలుకు సెల్ ఫోన్ తెచ్చినా.. వాటిని ప్రధానోపాధ్యాయులకు అప్పగించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్దితుల్లోనూ టీచర్లు క్లాస్ రూమ్లలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇకపై టీచర్లు సెల్ ఫోన్ తెచ్చినా దాన్ని స్కూలు అవసరణలో, ముఖ్యంగా క్లాస్ రూమ్ లలో వాడే అవకాశం లేనట్లే. కేవలం ప్రభుత్వం సూచించిన కార్యక్రమాలకు సెల్ ఫోన్ వాడినా ఆ తర్వాత తిరిగి ప్రధానోపాధ్యాయులకు అప్పగించాల్సిందే. ఈ ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వం మెమో జారీ చేసింది.












Click it and Unblock the Notifications