పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు సంక్రాంతి సర్ ప్రైజ్ గిఫ్ట్..!
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంతకంతకూ ఆలస్యమవుతోంది. అదే సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూములు కోల్పోయి నిర్వాసితులు అవుతున్న వారి వ్యథ కూడా అంతే స్ధాయిలో పెరుగుతోంది. వీరిని అక్కడి నుంచి తరలిస్తున్నందుకు పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని గత ఐదేళ్లుగా విడుదల చేయకపోవడంతో నిర్వాసితుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తాజాగా ప్రభుత్వం మారడంతో ఇకనైనా తమకు పరిహారం అందుతుందని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే సంక్రాంతి సందర్భంగా ఎలాంటి హంగామా లేకుండా చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు రూ.996 కోట్ల పరిహారాన్ని జమ చేసింది. వారి బ్యాంకు ఖాతాలకు ఈ మేరకు మెసేజ్ లు రావడంతో నిర్వాసితులు ఆశ్చర్యపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు పరిహారం అందుతుందని భావించామని, అయితే ఇంత త్వరగా పరిహారం అందుతుందని అనుకోలేదని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పోలవరం నిర్వాసితులకు పరిహారం విడుదల వెనుక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సహజంగా ఇంత పెద్ద మొత్తం విడుదల చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు నానా హంగామా చేస్తాయి. ప్రకటనతో మొదలుపెట్టే ఆర్భాటం బహిరంగసభలు పెట్టి ప్రచారం చేసుకునే వరకూ వెళ్తుంది. కానీ ఈసారి చంద్రబాబు ప్రభుత్వం అలా చేయలేదు. సీఎం చంద్రబాబు నుంచి ఆదేశాలు రావడంతో ఆర్ధిక శాఖ నుంచి నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ అయిపోయాయి.
మంత్రి నారా లోకేష్, జలవనరుల శాఖ, ఆఖరికి పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సైతం ఈ విషయంలో సమాచారం లేదని తెలుస్తోంది. దీంతో సంక్రాంతికి చంద్రబాబు పోలవరం నిర్వాసితులతో పాటు తమకు కూడా బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారని మంత్రులు చెప్పుకుంటున్నారు. కొందరు మాత్రం ఆర్ధిక శాఖ నుంచి తమకు సమాచారం లేకపోవడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications