ఏపీలో రిజిస్ట్రేషన్లపై సర్కార్ గుడ్ న్యూస్-వెయిటింగ్స్ కు చెక్ ...!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు భారీ మార్పులు చేపడుతోంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో ప్రభుత్వం మరో సంచలన ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో బ్రిటీష్ కాలం నాటి రెడ్ టేబుల్ పోడియం వ్యవస్థను తొలగించింది. అధికార దర్పానికి చిహ్నంగా ఉన్న ఆ పోడియాలను తొలగించింది. అలాగే రిజిస్ట్రేషన్ల విలువల్లో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వచ్చే వినియోగదారులకు పడిగాపులు లేకుండా చేసేందుకు మరో ఉత్తర్వు జారీ చేసింది.

దీని ప్రకారం ఇకపై ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే సబ్ -రిజిస్ట్రార్ ఆఫీసులకు వచ్చి పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. దీనికి బదులు ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చుని రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఇచ్చిన డేట్ కు ఆఫీసుకు వెళ్తే సరిపోతుంది. ఎలాంటి పడిగాపులు లేకుండా సింపుల్ గా మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు దీన్ని ముందుగా జిల్లా కేంద్రాల్లో ఉన్న రిజిస్టార్ ఆఫీసుల్లో అందుబాటులోకి తెస్తారు. ఆ తర్వాత క్రమంగా అన్ని ఆఫీసులకు వర్తింపజేస్తారు. ఇలా స్లాట్ బుక్ చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు నింపితే సరిపోతుంది. దీనికి ఎలాంటి ఛార్జీలు కూడా లేవు. అయితే స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం రూ.100, , రీషెడ్యూలింగ్ కు అయితే రూ.200 వసూలు చేయాలని నిర్ణయించారు. పని దినాల్లో సాయంత్రం 5 గంటల వరకూ ఇలా స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. సెలవు దినాల్లో స్లాట్ కావాలంటే మాత్రం 5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications