జగన్ సర్కార్ తో పోరు -మళ్లీ గెలిచిన కేఆర్ సూర్యనారాయణ.. !
ఏపీలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గతంలో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం వివాదాస్పదమైంది.
అమరావతి : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకూ, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుబడుతున్న సూర్యనారాయణ గతంలో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడంతో సమస్య మొదలైంది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో ఆయన్ను ఆహ్వానించడం లేదు. దీనిపై సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు.
ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చల్లో తమను పిలువకపోవడంపై హైకోర్టులో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ.. తాజాగా ఉద్యోగ సంఘాలతో జరిపిన మంత్రుల కమిటీ సమావేశానికి ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అది అధికారిక సమావేశం కాదని కోర్టుకు తెలిపింది. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

ప్రభుత్వం జరిపే ఉద్యోగ సంఘాల సమావేశాలకు APGEA ను పిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది.ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై APGEA నేతలు సూర్యనారాయణ, ఆస్కార్ రావు హర్షం వ్యక్తం చేసారు. ప్రతీ అధికారిక సమావేశానికి APCSJSC, మంత్రివర్గ ఉపసంఘం, అన్ని రకాల అధికారిక కమిటీ సమావేశాల్లో ను APGEA ను ఆహ్వానించాలని హైకోర్టు స్ఫష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications