
తప్పిన సర్కార్ లెక్క-ఏపీలో భారీ విద్యుత్ డిమాండ్-పవర్ హాలిడే పొడిగింపు-పవన విద్యుతే దిక్కు
ఏపీలో విద్యుత్ డిమాండ్ పై సర్కార్ వేసిన లెక్కలన్నీ తప్పాయి. మే 1 నుంచి విద్యుత్ కోతలు ఉండబోవని, అదనపు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని విద్యుత్ మంత్రి పెద్దిరెడ్డి చెప్పిన మాటలన్నీ ఒట్టివేనని తేలిపోయాయి. రాష్ట్రంలో అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను ప్రభుత్వం అస్సలు అంచనావేయలేకపోయింది. దీంతో విద్యుత్ కోతలు ఇప్పట్లో ఆగేలా లేవు. అదే సమయంలో పరిశ్రమలకు పవర్ హాలిడేను సైతం మరో 15 రోజులు పొడిగించింది.

అనూహ్యంగా విద్యుత్ డిమాండ్
ఏపీలో వేసవి తాపం పెరిగింది. వడగాల్పులు పెరుగుతున్నాయి. దీంతో పాటే విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతోంది. ప్రభుత్వం అదనపు విద్యుత్ కొనుగోలు చేస్తామని, మే 1 నుంచి అందుబాటులోకి తెస్తామని ప్రకటించినా అది సాధ్యం కాదని తెలిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం రోజుకు 220 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.
ఇందులో ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 75 మిలియన్ యూనిట్లు, జెన్ కో జల విద్యుత్ కేంద్రాల నుంచి 5 మిలియన్ యూనిట్లు, కేంద్ర విద్యుత్ సంస్ధల నుంచి 35 మిలియన్ యూనిట్లు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి 15 మిలియన్ యూనిట్లు, పవన విద్యుత్ నుంచి 26 మిలియన్ యూనిట్లు, సౌర విద్యుత్ నుంచి 23 మిలియన్ యూనిట్లు లభిస్తోంది. దీంతో పాటు సర్దుబాటు కోసం 34 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను పవర్ ఎక్ఛేంజ్ నుంచి డిస్కంలు కొంటున్నాయి.

కోతలతో అల్లాడుతున్న జనం
ఏపీలోని పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. అసలే వేసవి ఉక్కపోత, దీనికి విద్యుత్ కోతలు కూడా తోడవడంతో ఇళ్లలో జనం నరకయాతన అనుభవిస్తున్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తో విద్యుత్ కోతలు ఎన్ని గంటలు ఉంటాయో కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి.
దీంతో స్ధానికంగా ఉన్న డిమాండ్, ఇతర పరిస్ధితుల ఆధారంగా కోతలు కొవసాగుతున్నాయి. మే 1 నుంచి కోతలు ఉండబోవని గతంలో విద్యుత్ మంత్రి పెద్దిరెడ్డి చేసిన ప్రకటన అమల్లోకి రాలేదనే విమర్శలు పెరుగుతున్నాయి.

పవర్ హాలిడే 15 రోజులు పొడిగింపు
రాష్ట్రంలో అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ప్రభావం తొలుత పరిశ్రమలపైనే పడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పరిశ్రమలకు పవర్ హాలిడే అమలు చేస్తున్న ప్రభుత్వం మరోసారి దాన్ని పొడిగించింది. ఏప్రిల్ 15 వరకూ పవర్ హాలిడే పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటికే నష్టాలతో నడుస్తున్న ఎన్నో చిన్నా చితకా పరిశ్రమలు మూతపడే ప్రమాదం తలెత్తుతోంది.
భారీ పరిశ్రమలు సైతం నష్టాల బాటలో సాగుతున్నాయి. ఈ వేసవిలో కరెంటు కష్టాల నుంచి గట్టెక్కే దారిలేక అవి అల్లాడుతున్నాయి.రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారేలా ఉండటంతో విద్యుత్తు విరామాన్ని కొనసాగించాలని డిస్కంలు నిర్ణయించాయి.ఈ మేరకు పరిశ్రమలకు విద్యుత్తు విరామాన్ని ఈ నెల 15 వరకు పొడిగించాయి. డిస్కంలు తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పవన విద్యుత్ పైనే ఆశలు?
ఏపీలో ప్రస్తుతం వడగాల్పుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన విద్యుత్ ఉత్పత్తిపై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. గాలుల తీవ్రతతో ప్రస్తుతం దాదాపు 25 మిలియన్ యూనిట్ల పవన విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మరికొన్ని రోజుల్లో గాలుల తీవ్రత మరింతగా పెరిగితే ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
వాతావారణంలో అనూహ్య మార్పులు వస్తే మాత్రం సమస్యలు తప్పకపోవచ్చు. ఈ నెల రెండో వారం నుంచి గాలుల తీవ్ర పెరుగుతుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఈ నెలలో 1500 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అంచనా.