ఆశా వర్కర్లకు కూటమి ప్రభుత్వం తీపికబురు..!
ఆంధ్రప్రదేశ్ లోని ఆశా (Accredited Social Health Activists) వర్కర్లకు కూటమి ప్రభుత్వం తీపికబురు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశాలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న పలు అంశాలపై సానుకూలంగా స్పందించింది. అంతే కాకుండా ఇప్పటివరకు ఆశా వర్కర్ల రిటైర్మెంట్ వయస్సు 60 గా ఉండగా.. ఇప్పుడు దాన్ని 62 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సుమారు 42,000కి పైగా ఆశా వర్కర్లకు వచ్చే రెండు సంవత్సరాలు అదనంగా పనిచేసే అవకాశం లభించనుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రాట్యుటీ అమలు..
ఆశా వర్కర్లు పదవీ విరమణ చేసే నాటికి.. వారు పనిచేసిన ప్రతి సంవత్సరానికి రూ.5,000 చొప్పున.. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను సర్కారుకు సుమారు రూ.645 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఏపీ.. దేశంలో ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ చెల్లించే జాబితాలో ప్రత్యేక స్థానం పొందింది.

అంతే కాకుండా ఆశా వర్కర్లకు ఆరు నెలలపాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు అవుతాయని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వారికీ ఇలాంటి సౌకర్యం లేకపోవడంతో చాలా మంది ప్రసవానంతరం తిరిగి విధుల్లో చేరడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఆర్థిక భారంతో కూడిన నిర్ణయం అయినప్పటికీ, ఆశా వర్కర్ల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఆశా వర్కర్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవల అందజేతలో కీలక పాత్ర పోషిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రసూతి ముందు, తరువాత కూడా తల్లీబిడ్డల సంరక్షణ, టీకాల కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన, వ్యాధుల నివారణలో వీరి సేవలు అమూల్యమైనవని తెలిపారు. ఇక ఆశా వర్కర్ల సంఘాలు సైతం ప్రభుత్వ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications