సచివాలయాల ఉద్యోగుల జీతాల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తాజాగా వాటిల్లో పని చేసే ఉద్యోగుల జీతాల చెల్లింపు పైన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో పని చేసే సిబ్బందికి బయో మెట్రిక్ ఆధారంగానే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.
బయో మెట్రిక్ హాజరు
సచివాలయాల్లో ఉద్యోగుల జీతాలు ఇక బయో మెట్రిక్ హాజరు ఆధారంగానే చెల్లించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు బయో మెట్రిక్ తప్పని సరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1 నుంచి 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ విధానం ప్రవేశ పెట్టినా.. ఆ తరువాత నిలుపుదల చేసారు. ఇప్పుడు ప్రభుత్వం తిరిగి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో, సిబ్బంది ఖచ్చితంగా బయో మెట్రిక్ విధానంలో తమ హాజరు తెలియచేయాల్సి ఉంటుంది.

ప్రక్షాళన దిశగా
సచివాలయాల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సచివాలయ వ్యవస్థ ఇప్పటి వరకు పూర్తిగా ప్రభుత్వంలోని ఏ శాఖ అధీనంలోనూ లేదు. ఈ వ్యవస్థను గ్రామ పంచాయితీలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ప్రత్యేకంగా కొనసాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తోంది. అదే సమయంలో సచివాలయాల కుదింపు పైనా కసరత్తు జరుగుతోంది. పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా సచివాలయాల నిర్వహణ ఉందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది.
సిబ్బంది సర్దుబాటు
గ్రామ సచివాలయంలో నియమించిన 11 మంది ఉద్యోగుల పైనా పర్యవేక్షణ లోపించిందని ప్రభుత్వం గుర్తించింది. వారి పైన నియంత్రణ లేక పోవటం, వారంతా వేర్వేరు శాఖల పరిధిలో పని చేయటం వంటి వంటివి ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి సచివాలయాల పై సర్పంచులకూ కొన్ని అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా పంచాయితీకి ఒక సచివాలయం ఉండేలా ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఒకే గ్రామం లో రెండు నుంచి మూడు సచివాలయాలు ఉన్నాయి. దీంతో, అక్కడ పని చేస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో పని లేకుండా పోతుంది. ఇలాంటి వారిని గుర్తించి వారి సొంత శాఖలకు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications