Private Travels: ప్రైవేట్ ట్రావెల్స్ కు ఏపీ సర్కార్ తాజా వార్నింగ్..!
ఏపీలో సంక్రాంతి పండుగ ముగిసింది. పండుగ కోసం వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చిన జనం రిటర్న్ అవుతున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగిపోతోంది. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ మరోసారి రెచ్చిపోతున్నాయి. సంక్రాంతికి దూర ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకోవడం ప్రారంభించాయి. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై వరుస ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రైవేటు ట్రావెల్స్ పై వివిధ ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. ముఖ్యంగా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రవాణాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇదే క్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంక్రాంతి పండుగ అనంతరం తిరుగు ప్రయాణం పేరుతో ప్రయాణికుల్ని దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నుండి ఇతర రూట్లలో ప్రైవేట్ ట్రావెల్స్ భారీ ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్ పై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. దూరాన్ని బట్టి రెట్లు ఛార్జీలు పెంచడం చట్టవిరుద్ధం, అన్యాయం అన్నారు. ప్రయాణికులకు ప్రభుత్వం అండగా ఉందని, అధిక ఛార్జీలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 9281607001 ను సంప్రదించాలని మంత్రి కోరారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత ట్రావెల్స్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications