ఏపీ-అదానీ డీల్ లో కీలక పరిణామం-సెకీ వాదనపై సర్కార్ అభ్యంతరాలు..!
ఏపీకి పాతికేళ్ల పాటు 12 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సెకీ కుదుర్చుకున్న ఒప్పందం కోసం సరఫరాదారు అయిన అదానీ పవర్ నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దకు రూ.1750 కోట్ల ముడుపులు అందాయన్న ఆరోపణలు ఓవైపు కొనసాగుతుండగానే.. మరోవైపు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీకి విద్యుత్ సరఫరా కోసం ఒప్పందం చేసుకున్న సెకీకి 2300 మెగా వాట్ల విద్యుత్ ను బదిలీ చేసేందుకు మరో సంస్థ అజూర్ పవర్ చేసుకున్న డీల్ వివాదాస్పదమవుతోంది.
అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థకు అజూర్ పవర్ నుంచి 2300 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా కోసం జరిగిన డీల్ ప్రజా ప్రయోజనం కోసమేనంటూ కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) దగ్గర కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సెకీ చేసిన వాదన ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వాదనను ప్రస్తుతం ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రజాప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

2019లో అప్పటి వైసీపీ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలో విద్యుత్ సామర్థ్య బదిలీని అడ్డుకోవడం లేదా అనుమతించడం వంటి నిబంధనలు ఏవీ లేనప్పటికీ, అదానీకి దీన్ని బదిలీ చేయడంలో "ప్రజా ప్రయోజనం" ఏమిటనేది ప్రశ్న అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదించింది. సెకీ ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో ఒప్పందంలో ఉంది కాబట్టి మధ్యలో ఇలా సరఫరాదారు అదానీ ఒప్పందాలు చేసుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తోంది.
2019లో కుదిరిన ఒప్పందం ప్రకారం అజూర్ పవర్ నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీకి విద్యుత్ సామర్ధ్యం బదిలీకి అనుమతించే విషయంలో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి అక్టోబర్ 28న సెకీ అభిప్రాయం కోరింది. దీనికి బదులుగా ప్రజా ప్రయోజనం ఉన్న ఈ అంశంలో ముందుకెళ్లవచ్చంటూ సెకీ తెలిపింది. దీనిపైనే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అదానీ ఒప్పందంపై అమెరికా కోర్టులో విచారణ జరుగుతుండటం, అదానీ ఎనర్జీ చెల్లించిన లంచానికి బదులుగానే అజూర్ ఈ విద్యుత్ బదిలీ చేసినట్లు అమెరికా స్టాక్ ఎక్జేంజ్ కమిషన్ ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదానీ గ్రూప్ అయితే అమెరికా సంస్థల ఆరోపణల్ని కొట్టిపారేస్తోంది.












Click it and Unblock the Notifications