కెసిఆర్ 'నమస్తే తెలంగాణ'లో కథనం: సరేనంటూ.. స్పందించిన ఏపీ!
హైదరాబాద్: తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన వెలకట్టలేని బౌద్ధ శిల్పాలు, స్థూపాలు, నాణేలు ఇతర పురాతన సంపద ఆంధ్రప్రదేశ్‌లో మగ్గిపోతోందని ఇటీవల నమస్తే తెలంగాణ పత్రికలో వార్త వచ్చింది. అయితే, దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినట్లుగా నమస్తే తెలంగాణ పేర్కొంది.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ, ఏపీలకు చెందిన పురావస్తు సంపదను ఎక్కడి వాటిని అక్కడికే తరలించాలని తెలంగాణ, ఏపీలు నిర్ణయించాయి. పురావస్తు సంపదను ఏ రాష్ట్రానికి చెందిన వాటిని ఆ రాష్ర్టానికే చేరే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
రెండు రాష్ర్టాలకు చెందిన పురావస్తు సంపద, శిల్పాలు, ఆనవాళ్లు, శాసనాలను ఎక్కడికి చెందినవి అక్కడికే చేరే విధంగా చర్యలు తీసుకోవాలని రెండు ప్రభుత్వాలకు చెందిన పురావస్తు శాఖ ఉన్నతాధికారులు బుధవారం నిర్ణయించారు.

ఈ మేరకు రెండు రాష్ర్టాల పురావస్తు శాఖ అధికారులతో కమిటిని ఏర్పాటు చేయాలని రెండు ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. త్వరలోనే ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ, ఉత్తర్వులు జారీ కానున్నాయని తెలంగాణ పురావస్తు శాఖ డైరెక్టర్ సునీత ఎం భగవత్ తెలిపారు.
నమస్తే తెలంగాణ దిన పత్రికలో వచ్చిన కథనంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు స్పందించాయని నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది. తెలంగాణ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో బయల్పడిన విలువైన బౌద్ధ నిక్షేపాలు, శిల్పాలను 2006లో బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా అమరావతిని సందర్శించినప్పుడు తీసుకెళ్లిన మాట వాస్తవమేనని ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొంది.
అయితే రాష్ట్రం ఇన్నాళ్లూ ఉమ్మడిగా కొనసాగడం వల్ల వాటిని తిరిగి తెలంగాణకు తరలించలేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో విలువైన బౌద్ధ నిక్షేపాలు బయటపడ్డాయని పురావస్తు శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం చెప్పారు.
దేశంలో బౌద్ధమత ఆనవాళ్లు అత్యధికంగా బీహార్, ఉత్తరప్రదేశ్‌లో బయటపడ్డాయని, మూడో స్థానంలో తెలంగాణ ప్రాంతం ఉందన్నారు. తెలంగాణలోనే బుద్ధుని ఆనవాళ్లు లభించిన ప్రాంతాలు అనేకం ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications