బయటకొచ్చిన పీఆర్సీ కమిటీ సిఫార్సులు - అవి అమలు చేసినా : ప్రయోజనం ఎవరికి..!!
ఏపీ ప్రభుత్వం 11వ పీఆర్సీ నివేదికను బయట పెట్టింది. ఉద్యోగ సంఘాల నేతలు ఈ నివేదిక కోసం పీఆర్సీ చర్చలకు ముందు చాలా రోజులు నిరీక్షించారు. నివేదిక ఇవ్వాలని పలు మార్లు ప్రభుత్వాన్ని కోరారు. కానీ, ప్రభుత్వం నుంచి మాత్రం బయటకు రాలేదు. ఇక, పీఆర్సీ ఖరారు చర్చల్లో భాగంగా.. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆశుతోష్ మిశ్రా నివేదికను బయట పెట్టింది. అందులో కమిటీ మూలవేతనంపై 27% ఫిట్‌మెంట్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. కానీ, ప్రభుత్వం ఈ నివేదిక స్థానంలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి..వారిచ్చిన సిఫార్సుల ఆధారంగా చర్చలు మొదలు పెట్టింది.

కమిటీ నివేదిక బహిర్గతం
అదే విధంగా పూర్తి చేసి 23 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేసింది. ఇప్పుడున్న ఇంటి అద్దె భత్యాల్ని తగ్గించకుండా, సీసీఏని కొనసాగిస్తూ, మరిన్ని వెసులుబాట్లు, ప్రయోజనాలు కల్పిస్తూ సిఫార్సులు ఉన్నాయి. వీటిని మొత్తంగా అమలు చేసినా ప్రభుత్వం పైన ఆర్థికభారం రూ.3,181 కోట్లే అర్దిక భారం పడుతుందని కమిటీ పేర్కొంది.
ఇంటి అద్దె భత్యాల్ని కొనసాగిస్తూ, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో పనిచేసేవారికి 22% హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలంటూ కొత్త కేటగిరీని ప్రతిపాదించింది. ఉద్యోగులతో చర్చలు ముగిసి..తాజాగా జరిగిన ఒప్పందాల మేరకు జీఓలు..జీతాలు విడుదల అయిన తరువాత ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను ఇప్పుడు వెబ్ సైట్ లో ఉంచింది.

27 శాతం ఫిట్ మెంట్ సిఫార్సు
ప్రభుత్వం 23 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేసిన సమయంలో..హెచ్ఆర్ఏ పైన ఇచ్చిన జీవోలతో ఒక్కసారిగా ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. సమ్మె నోటీసు ఇచ్చాయి. ఆ తరువత ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలతో తిరిగి హెచ్ఆర్ఏ పెంపుకు నిర్ణయం జరిగింది. కానీ, అశుతోష్ మిశ్రా కమిటీ చేసిన సిఫార్సుల్లో కనీస వేతనం రూ.20 వేలుగా ఉంది.
వేతన స్కేళ్లు: 32 గ్రేడులు, 83 స్టేజీలతో మాస్టర్ స్కేళ్లు. గతంలో 81గా ఉన్న స్టేజీల సంఖ్య 83కి పెంపు. వార్షిక ఇంక్రిమెంట్ తొలి స్టేజీల్లో 3% నుంచి మొదలుపెట్టి 2.34%తో ముగిసేలా సిఫార్సు. కనీస వేతనం రూ.20వేలు చెల్లించాలి. గరిష్ఠ వేతనం రూ.1.79 లక్షలు ఉండాలని సిఫార్సులు చేసింది. అదే విధంగా హెచ్ఆర్ఏ అంశంలోనూ కమిటీ కీలక సిఫార్సులు చేసింది.

హెచ్ఆర్ఏ పైన సూచనలు
అందులో భాగంగా.. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు: మూలవేతనంపై 30%, నెలకు రూ.26 వేలకు మించకుండా ఇవ్వాలని ప్రతిపాదించింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు: మూలవేతనంపై 22%, నెలకు రూ.22,500 మించకుండా సిఫార్సుల్లో పేర్కొంది. 2-10 లక్షలు జనాభా కలిగిన నగరాల్లో పనిచేసే వారికి: మూలవేతనంపై 20%, నెలకు రూ.20,000 మించకుండా చూడాలని సిఫార్సు చేసింది.

పీఆర్సీ ఖరారు అయిన తరువాత
50 వేలు-2 లక్షల లోపు జనాభా కలిగి నగరాల్లో ఉద్యోగులకు: మూలవేతనంపై 14.5%, నెలకు రూ.20,000 మించకుండా...ఇక, మిగతా ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు: మూలవేతనంపై 12%, నెలకు రూ.17,000 మించకుండా హెచ్ఆర్ఏ అమలుకు సిఫార్సులు అందించింది. ఇప్పటికీ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు.. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చేసుకున్న పీఆర్సీ ఒప్పందాల పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళన బాట పడుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయట పెట్టటం తో ఈ వ్యవహారం కొత్త చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications