ఏపీ సర్కారు షాకింగ్ డిసిషన్.. ఆ యాత్రకు బ్రేక్ !
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలం నుంచి పాపికొండల వరకూ నదీ విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో నీటిమట్టం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జలవనరుల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకొని బోటు ప్రయాణాలపై తాత్కాలిక నిషేధం విధించినట్టు అధికారులు వెల్లడించారు.
గతంలో..
గోదావరిలో పాపికొండల ప్రాంతంలో గతంలో కూడా పలు బోటు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2019 సెప్టెంబర్ లో దేవీపట్నం మండలం వద్ద రాయలవరం ఘాట్ దగ్గర "రాయల్ వాషి" అనే బోటు బోల్తా పడిన ఘటనలో 60 మందికిపైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. బోటులో అధిక ప్రయాణికులు ఉండటం, సరైన భద్రతా చర్యలు లేకపోవడం, నీటి ప్రవాహ తీవ్రతను అంచనా వేయకపోవడం వంటి వల్ల ప్రజాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత బోటు యాత్రలో భద్రతపై ప్రభుత్వం మరింత ఆంక్షలు విధించింది.

ప్రజలకు సూచనలు..
కాగా దేవీపట్నం మండలం దండంగి - డి. రావిలంక గ్రామాల మధ్య ఆర్అండ్‌బీ రహదారిపై గోదావరి నీరు ప్రవహిస్తోంది. దాంతో గండి పోచమ్మ ఆలయం వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతే కాకుండా చాలా ప్రాంతాల్లో లోతట్టు గ్రామాలు నీట మునిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రామస్తులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం ప్రమాదకరంగా ఉన్నందున ప్రజలు బోటు ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తాత్కాలిక పునరావాస కేంద్రాల ఏర్పాటుపై కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications