ఏపీ సర్కార్ కు గుడ్ న్యూస్ ..! వైజాగ్ సదస్సుకు ముందే కీలక ఒప్పందం..!
విశాఖలో రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. ఈ భాగస్వామ్య సదస్సు కంటే ముందుగానే భారీ ఎత్తున ప్రభుత్వం వివిధ సంస్ధలతో ఎంఓయూలు కుదుర్చుకుంటోంది. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంత్రి నారా లోకేష్ సంతకాలు పూర్తి చేసేస్తున్నారు.
మంత్రి లోకేష్ ఇవాళ ఉదయం ప్రకటించినట్లు ఇంథన రంగంలో రెన్యూ పవర్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖలో ఎపి ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. రూ.82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూలు రెన్యూ పవర్ సంస్థ ప్రతినిధులు డీల్ చేసుకున్నారు.

ఇందులో భాగంగా ఈడీబీతో రూ.60 వేల కోట్ల విలువైన నాలుగు ఎంఓయూల్ని రెన్యూ పవర్ సంస్థ చేసుకుంది.
ఇవి కాకుండా గతంలోనే అంగీకరించిన రూ.22 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో రెన్యూ పవర్ సంస్థ పెట్టుబడులు పెడుతోంది. ఒప్పందంలో భాగంగా 6 GW PV ఇంగోట్-వేఫర్ ప్లాంట్, 2 GW పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్, 300 KTPA గ్రీన్ అమ్మోనియా సౌకర్యం, విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ వంటి వాటిల్లో 5 GW హైబ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు.

తాజా ఎంఓయూల ద్వారా 10 వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధికి అవకాశం కలగబోతోంది. ఇప్పటికే దేశంలోని అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి ప్రాజెక్టును అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రెన్యూ పవర్ అంగీకరించింది. లోకేష్ ట్వీట్ చేసిన ప్రకటనపై విశాఖలో ఇవాళ సిఐఐ సమ్మిట్ కు ముందే ఒప్పందం కుదిరింది.












Click it and Unblock the Notifications