AP Pensions: నేటి నుంచి వారికి ఇంటి దగ్గరే పెన్షన్..!
ఏపీలో మే నెల పెన్షన్ల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ తో లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలకు ఇప్పటికే అధికారులు పెన్షన్లను క్రెడిట్ చేయడం, వారు బ్యాంకులకు వెళ్లి తీసుకోవడం జరిగిపోతోంది. అయితే ఇందులోనూ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండుటెండల్లో ముసలీ ముతకా జనం బ్యాంకులకు వెళ్లి పెన్షన్ల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. అయితే ఆధార్ లింక్ లేని వారికి మాత్రం ఇవాళ్టి నుంచి ఇళ్లకే పెన్షన్ రానుంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల మంది సామాజిక పెన్షన్లు అందుకుంటున్నారు. వీరిలో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇలా చాలా కేటగిరీలు ఉన్నాయి. వీరిలో చాలా వరకూ ఆధార్ ను బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసుకునే ఉన్నారు. దీంతో ప్రభుత్వం దాదాపు 64 లక్షల మంది వరకూ ఇలా పెన్షన్లను బ్యాంకు ఖాతాల్లో వేసి చేతులు దులుపుకుంది. ఇక మిగిలిన లక్ష మందికి ఇవాళ్టి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.

బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ అయినా ఇతరత్రా సాంకేతిక కారణాలతో పలువురికి పెన్షన్లు అందలేదు. ఇలాంటి వారికి సైతం ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీకి ఆదేశాలు ఇచ్చారు. దీంతో బ్యాంకు ఖాతాలు లేని వారితో పాటు ఇప్పటివరకూ బ్యాంకుల్లో పడని వారికి సైతం ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నారు. సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. ఇవాళ, రేపట్లో ఈ ప్రక్రియ ముగియనుంది.












Click it and Unblock the Notifications