వాలంటీర్ల వేతనాలు, కొనసాగింపు పై ప్రభుత్వం తాజా కండీషన్స్..!!
వాలంటీర్ల కొనసాగింపు పై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది .గత మంత్రివర్గ సమావేశంలోనే వాలంటీర్ల పైన చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయాల్లో వాలంటీర్ల సేవల కొనసాగింపుతో పాటుగా..ఎంత మంది అవసరం అవుతారనే లెక్కలను అధికారులను సిద్దం చేసారు. జీతాల చెల్లింపు పైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు.
వాలంటీర్లను ఏం చేద్దాం
ఏపీలో వాలంటీర్ల సేవలు..వేతనాలపై పై ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను కొనసాగిస్తూనే..వారికి ఇచ్చే వేతనం రూ 10 వేలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే, వాలంటీర్ల కొనసాగింపు విధి విధానాలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఖరారు చేయలేదు. వాలంటీర్లకు విధులు లేక పోవటంతో నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించటం లేదు. దీంతో..తమకు హామీ ఇచ్చిన విధంగా విధులు కేటాయిస్తూనే..వేతనాలు ఇవ్వాలని వాలంటీర్లు ఆందోళన బాట పట్టారు.

ప్రభుత్వం కసరత్తు
అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం కొనసాగుతున్న డైలమా వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన అస్పష్టత కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు వలంటీర్లు రాజీనామా చేయగా, ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశతో మిగిలినవారు కొనసాగుతున్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి జాబ్‌చార్ట్‌నూ అప్పగించలేదు. మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండన్నర లక్షల మంది వలంటీర్లు ఉండగా, ఎన్నికల సమయంలో వారిలో సగం మంది రాజీనామా చేసినట్లు చెప్తున్నారు. దాదాపు లక్ష మందికిపైగా వాలంటీర్లు ప్రస్తుతం తిరిగి విధుల్లో చేరేందుకు సిద్దమయ్యారు. వీరి విషయంలో అధికారులు తాజాగా ఒక నివేదిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
కండీషన్స్ అప్లై
1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఓ వైపు పింఛన్ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పట్లో అధికారులు అంగీకరించలేదు. దీంతో సచివాలయ ఉద్యోగులతోనే పకడ్బందీగా పింఛన్ల పంపిణీ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లలో విద్యార్హత ఆధారంగా వారికి విధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైన శాఖల్లో వారి సేవలను వినియోగించుకుంటూ హామీ ఇచ్చిన విధంగా రూ 10 వేలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే, అందరినీ కాకుండా ఎవరికి విధులు అప్పగించాలనే దాని పైన ప్రభుత్వం మార్గదర్శకాల ను సిద్దం చేస్తోంది. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోద ముద్ర వేసి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications