అమరావతి రైతులకు భారీ ఊరట..! రిటర్నబుల్ ప్లాట్లకు త్వరలో..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు కొంతకాలంగా తమ సమస్యలు తీరడం లేదని ఆందోళనలు చేస్తున్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటే ఏడాదిన్నర అవుతున్నా అమరావతిలో తమ సమస్యలు తీరడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు డిమాండ్ చేస్తున్న ఓ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. ఈ మేరకు అధికారులకు మున్సిపల్ మంత్రి నారాయణ కీలక ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతిని గతంలో టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన తర్వాత భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీ మేరకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడం ప్రారంభించారు. రైతులకు ఎక్కడ ప్లాట్లు ఇస్తున్నారో చూపించి వాటికి సరిహద్దు రాళ్లు కూడా వేయించారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి కాకుండానే రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ రిటర్నబుల్ ప్లాట్ల వ్యవహారాన్ని నిర్లక్ష్యం చేయడంతో సరిహద్దు రాళ్లు కూడా కుంగిపోయాయి.

దీంతో తమ ప్లాట్లు ఎక్కడున్నాయో, ఎంత హద్దులో ఉన్నాయో తెలియక అమరావతి రైతులు ఆందోళన చెందడం ప్రారంభించారు. గతేడాది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా గతంలో అమరావతి రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్లను వారికి పూర్తి స్దాయిలో పంపిణీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్లు చేయించడం, ఇతర సమస్యలు తీర్చడంపై దృష్టిపెట్టారు.

ఇదే క్రమంలో తమకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ లలో వేసిన సరిహద్దు రాళ్ళు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. దీంతో మున్సిపల్ మంత్రి నారాయణ ఆదేశాలతో వచ్చే నెల 15వ తేదీ నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్ల కు పెగ్ మార్క్ వేసి హద్దు రాళ్లు వేయాలని సీఆర్డీయే నిర్ణయించింది. మూడు నెలల్లోగా రైతుల ప్లాట్ లలో సరిహద్దు రాళ్ళు వేయడం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో రైతుల సమస్య తీరబోతోంది.












Click it and Unblock the Notifications