ఏపీలో ఆ పెన్షన్ల ఏరివేత - ముహుర్తం ఖరారు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వాటిలో కోతలు పెడుతోంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం అర్హత లేకపోయినా అక్రమంగా పలువురికి పెన్షన్లు ఇచ్చిందని ఆరోపిస్తున్న కూటమి సర్కార్ వాటి లెక్కలు తేల్చేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 3 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో అర్హత లేకపోయినా అక్రమంగా పథకాల లబ్ది పొందుతున్న వారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే నకిలీ రేషన్ కార్డుల ఏరివేతకు పైలట్ ప్రాజెక్టుగా డ్రైవ్ నిర్వహించింది. ఇప్పుడు అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న వారిపై ఫోకస్ పెడుతోంది. ఇందులో ముందుగా దివ్యాంగుల పెన్షన్లు అక్రమంగా తీసుకుంటున్న వారిపై దృష్టిసారిస్తోంది. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి ఇలా దివ్యాంగుల పెన్షన్లు తీసుకుంటున్న వారి ఏరివేతకు డ్రైవ్ నిర్వహించబోతోంది.

రాష్ట్రవ్యాప్తంగా నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3నుంచి ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే వరకు ఈ పరీక్షలు కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకూ కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాల జారీని ప్రభుత్వం తాత్కాలికంగా ఆపింది. మరోవైపు ఇలా వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దీంతో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.












Click it and Unblock the Notifications