ఏపీలో రేషన్ కార్డు దారులకు దసరా కానుక-నేటి నుంచే అమలు..!
ఏపీలో రేషన్ కార్డు దారులకు దసరా శరన్నవరాత్రుల వేళ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిత్యావసర సరుకుల మంటతో సతమతం అవుతున్న రేషన్ కార్డు దారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. అంతే కాదు ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రాబోతోంది.
రాష్ట్రంలో పండుగ వేళ నిత్యావసర వస్తువైన నూనెల ధరలు మండిపోతున్నాయి. దీంతో పేదలకు ఊరటనిచ్చేలా ఇవాళ్టి నుంచి రేషన్ షాపుల్లో డిస్కౌంట్ ధరలకే వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందులో భాగంగా పామాయిల్ లీటర్ 110 రూపాయలకు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ 124 రూపాయలకే అందించనున్నారు. రేషన్ కార్డ్ ఆధారంగా పామాయిల్ మూడు ప్యాకెట్లు, సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ప్యాకెట్ మాత్రమే అమ్మబోతున్నారు.

వంట నూనె ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇలా డిస్కౌంట్ ధరలపై నూనెల్ని అమ్మాలని నిర్ణయించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం వంటనూనెల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో వంటనూనె అమ్మకములో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నెలాఖరు వరకూ ఇదే ధరలపై విక్రయిస్తారు.
విజయవాడ సివిల్స్ సప్లయిస్ భవన్ లో వంట నూనె సరఫరాదారులు, డిస్ట్రిబ్యూటర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తకులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. ఇందులో అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ధరల నియంత్రణ, వర్తకుల సమస్యలపై చర్చించారు. ఇండోనేషియా మలేషియా ఉక్రెయిన్ తదితర దేశాల నుంచి దిగుమతులు తగ్గడం, సోయా ఎంఆర్పి ధర పెరగడం, వంట నూనె మీద డ్యూటీ టాక్స్ పెరగడం, సప్లై తక్కువగా ఉండడం, ప్యాకింగ్ చార్జీలు పెరగడం వంటి అంశాలపైనా చర్చించారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications