ఉద్యోగులకు జగన్ సర్కార్ రెండు గుడ్ న్యూస్ లు-వారికి 5 రోజుల పనిదినాలు పొడిగింపు..
ఏపీలో ఉద్యోగులకు గత కేబినెట్ భేటీలో ప్రభుత్వం కొన్ని కీలక అంశాలపై శుభవార్తలు చెప్పింది. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దుపై కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే హెచ్ఆర్ఏ పెంపుపైనా కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి కొనసాగింపుగా అన్నట్లుగా ఇవాళ మరిన్ని అంశాల్లో వారికి ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రెండు అంశాల్లో ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అక్కడక్కడా ఉన్న అసంతృప్తిని సైతం తొలగించేలా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఉద్యోగుల శాఖాపరమైన వ్యక్తిగత సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రతి నెలా మూడో శుక్రవారం గ్రీవెన్సు డే ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్లు,శాఖాధిపతుల కు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసే వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది. జగనన్నకు చెబుదాం ద్వారా వీరి సమస్యలు పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తోంది.

అలాగే రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న ఐదురోజుల పనిదినాల విధానాన్ని కూడా పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్,హెచ్ఓడి,ఇతర రాష్ట్ర కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులు పని దినాలు కొనసాగించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రేపటి నుంచి ఏడాది పాటు అమల్లో ఈ నిబంధనలు అమల్లో ఉండబోతున్నాయి. దీంతో పాటు ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకూ పనివేళలు కూడా కొనసాగుతాయి.

ఎన్నికలకు 9 నెలలే గడువున్న నేపథ్యంలో ఉద్యోగుల్లో అసంతృప్తిని దాదాపుగా తొలగించాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని కోరుతోంది. దీంతో వారు కూడా ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications