ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీ-ఏడుగురు ఐపీఎస్ ల సహా 70 మందికి స్ధాన చలనం..
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులను తాజాగా భారీ ఎత్తున బదిలీ చేసింది. ఇప్పుడు డీఎస్పీలకు సైతం స్ధాన చలనం కల్పించింది. రాష్ట్రంలో ఒకేసారి ఏకంగా 70 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వారితో పాటు ఏడుగురు ఐపీఎస్ లు కూడా ఈసారి బదిలీ అయ్యారు. ఒకే చోట మూడేళ్లు పూర్తి చేసుకున్న డీఎస్పీలను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈసారి డీఎస్పీల బదిలీల్లో దాదాపు అన్ని జిల్లాల్ని కవర్ చేసినట్లు తెలుస్తోంది. ఒకే చోట మూడేళ్లు పనిచేయడంతో పాటు పలు అంశాల్ని ప్రామాణికంగా తీసుకుని డీఎస్పీల బదిలీలు చేపట్టినట్లు అర్ధమవుతోంది. అలాగే వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్న పలువురు అధికారులు కూడా మరో ప్రాంతానికి బదిలీ అయ్యారు. వీరిలో అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ చైతన్య వంటి వారు ఉన్నారు.

తాజాగా బదిలీ అయిన వారిలో జిల్లాల్లో పనిచేస్తున్న వారితో పాటు దిశ వంటి పలు ప్రత్యేక విభాగాల్లో పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. ఈసారి బదిలీల్లో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పలువురు అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చారు. అలాగే మరికొందరిని ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అటు బదిలీ అయిన అధికారులు కూడా వెంటనే కొత్తగా బదిలీ ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిన్న జరిగిన పోలీసు ఎస్టాబ్లిష్ మెంట్ బోర్డు సమావేశంలో ఈ బదిలీలకు ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల ఏడాది కావడంతో కీలక స్ధానాల్లో ఎక్కువ కాలం పనిచేసిన అధికారుల్ని తప్పకుండా బదిలీ చేయాల్సిన పరిస్ధితి. లేకుంటే ఎన్నికల కోడ్ రాగానే ఎన్నికల సంఘం వారిని బదిలీ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే తాజాగా ఐపీఎస్ అధికారుల్ని కూడా భారీగా బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏడుగురు ఐపీఎస్ లతో పాటు డీఎస్పీలను కూడా బదిలీ చేయడంతో వచ్చే ఎన్నికల వరకూ వీరు అవే స్ధానాల్లో కొనసాగే అవకాశముంది.












Click it and Unblock the Notifications