IAS Transfers: ఏపీలో 11 మంది ఐఏఎస్ ల బదిలీ-టీటీడీ ఈవో సహా వీరే..!
ఏపీలో కూటమి సర్కార్ ఇవాళ పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని వారు పనిచేస్తున్న స్ధానాల నుంచి బదిలీ చేసింది. మొత్తం 11 మంది ఐఏఎస్ లను ఇలా బదిలీ చేసింది. వీరిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, గవర్నర్ కార్యదర్శితో పాటు పలు శాఖల కార్యదర్శులు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా ఐఏఎస్ ల బదిలీలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ప్రస్తుతానికి
11 మందిని మాత్రమే బదిలీ చేసింది.
ఇవాళ ప్రభుత్వం బదిలీ చేసిన ఐఏఎస్ అధికారుల్లో సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారితో పాటు పలువురు రెగ్యులర్ అధికారులు కూడా ఉన్నారు. ఇందులో ప్రధానంగా టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌కు మరోసారి అవకాశం కల్పించారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సింఘాల్ కు గతంలో ఓసారి టీటీడీ ఈవోగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు మరోసారి ఆయనకు అదే చోట అవకాశం దక్కింది.

టీటీడీకి సింఘాల్ రాకతో టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావు బదిలీ అయ్యారు. శ్యామలరావును ఏకంగా జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా నియమించారు. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబును రవాణా, రోడ్లు భవనాలశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. కృష్ణబాబు స్ధానంలో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరవ్ గౌర్ ను నియమించారు.

మరోవైపు ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాకు అవకాశం దక్కింది. అలాగే దిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్ ను నియమించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రిటైర్డ్ అధికారి హరిజవహర్ లాల్ స్ధానంలో అనంతరాముకు అవకాశం కల్పించారు. అలాగే మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్.శ్రీధర్ ను నియమించారు. రవాణా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కాంతిలాల్ దండే ను అటవీ పర్యావరణశాఖ కార్యదర్శిగా నియమించారు.












Click it and Unblock the Notifications