ఏపీ గవర్నర్ అసలు పని మొదలుపెట్టేశారా ? జగన్ సర్కార్ కు పరీక్ష ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ను మార్చి ఆయన స్ధానంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కేంద్రం గతంలో గవర్నర్ గా పంపింది. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రెండు నెలల్లో అబ్దుల్ నజీర్.. వైసీపీ ప్రభుత్వంతో సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా గవర్నర్ తీసుకున్నారని చెబుతున్న ఓ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది.
ఏపీలో ఆర్ధిక పరిస్ధితితో పాటు సంక్షేమ పథకాల అమలు, అప్పుల సేకరణ వంటి విషయాల్లో అధికార, విపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం, కాగ్ చెప్పే లెక్కలతో జగన్ సర్కార్ లెక్కలు సరిపోలడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పుల పరిమితి పెంచాలన్నా, ఏపీకి సంబంధించి ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, అలాగే ఏపీ ప్రభుత్వం పనితీరు తప్పుబట్టాలన్నా కేంద్రానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు సంబంధించి నెలవారీ నివేదికలు పంపాలని గవర్నర్ కోరినట్లు తెలుస్తోంది.

ఏపీలో వాస్తవ పరిస్ధితులపై తనకు నెలవారీ పురోగతి నివేదికలు(ప్రోగ్రెస్ రిపోర్ట్స్) పంపాలని సాధారణ పరిపాలన శాఖను గవర్నర్ అబ్దుల్ నజీర్ కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ లేఖ కూడా రాసినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం ఇప్పుడు గవర్నర్ కోరిన విధంగా సమాచారం పంపేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇది సాధారణంగా జరిగేదే తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదని ఇరువర్గాలు అంతర్గతంగా చెబుతున్నాయి. కానీ ఎన్నికల వేళ గవర్నర్ ఇలా ప్రత్యేకంగా నివేదికలు కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవానికి బీజేపీయేతర పార్టీలు పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం నియమించిన గవర్నర్లు ఇప్పటికే ఇలాంటి నివేదికల పేరుతో ఆయా ప్రభుత్వాల్ని టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలో కూడా ఇదే కోవలో గవర్నర్ నివేదికలు కోరారా లేక సాధారణ కసరత్తులో భాగంగా ఆడిగారా అన్నది ఇంకా తేలలేదు. ఒకవేళ కేంద్రం సూచనల మేరకు ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ ను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ నివేదికలు అడిగితే మాత్రం ఇబ్బందులు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో గవర్నర్ తీసుకునే నిర్ణయాలు, వాటిపై ప్రభుత్వం స్పందించే తీరును బట్టి ఏం జరుగుతుందో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications