ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హెల్త్ బులిటెన్ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండ్రోజుల క్రితం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో మణిపాల్ ఆస్పత్రి వైద్యులు అపెండెక్టమీ సర్జరీని రోబో సాయంతో చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న డాక్టర్లు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.
ఈ మేరకు మణిపాల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపుడి బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కాగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ కడుపునొప్పితో సోమవారం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. డాక్టర్లు ప్రాథమిక వైద్య పరీక్షలు చేయగా.. మెడికల్ టెస్టుల్లో గవర్నర్ ఆక్యుట్ అపెండిసైటిస్‌తో బాధపడుతున్నారని నిర్ధారించారు.

ఈ క్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు రోబో సహాయంతో అపెండక్టమీ అనే సర్జరీ చేసినట్లు మణిపాల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని హెల్త్ బులెటిన్‌లో వైద్యులు వెల్లడించారు.
కాగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై.. సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గవర్నర్ అస్వస్థత సమాచారం అందుకున్న వెంటనే.. సీఎం జగన్ అధికారులతో మాట్లాడారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
అనారోగ్యానికి గురై మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ త్వరగా కోలుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆకాంక్షించారు. కడుపునొప్పితో గవర్నర్ ఆస్పత్రిలో చేరారని తెలిసి ఆందోళనకి గురయ్యానని. అపెండిసైటిస్‌గా తేల్చిన వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా చేశారని, ఆరోగ్యం నిలకడగా ఉందనే సమాచారం తెలిసి ఊపిరి పీల్చుకున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications