పాత రేషన్ కార్డులు రద్దు - వీరికి కొత్తగా, మార్గదర్శకాలు..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త కార్డుల మంజూరుకు అర్హతల ను ఖరారు చేయాలని అధికారులకు సూచించింది. నూతన దంపతులకు కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అదే సమయంలో వైసీపీ రంగులతో ఉన్న పాత రేషన్ కార్డులను రద్దు చేయనుంది. వాటి స్థానంలో కొత్త కార్డుల మంజూరు పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పాత కార్డుల రద్దు
ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పైన కసరత్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా వైసీపీ ప్రభుత్వం పార్టీ రంగులు..జగన్ బొమ్మతో ఉన్న కార్డులే అమల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ రేషన్‌కార్డులను తొలగించి కొత్త కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్‌కార్డుల రూపకల్పనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అధికారులు పలు డిజైన్లు పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగుతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించిన కార్డుల నమూనాను అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. దాంతోపాటు మరికొన్ని నమూనాలను కూడా ప్రభుత్వ పరిశీలనకు పంపించారు.

స్మార్ట్ కార్డులు
స్మార్ట్ కార్డుల జారీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల వలస కార్మికులు, కుటుంబాలు దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రంలో 1,36,420 మంది జాతీయ ఆహార భద్రతా కార్డుదారులు, మరో 17,941 మంది అంత్యోదయ అన్న యోజన కార్డుదారులు కలిపి మొత్తం 1,44,361 కార్డుదారులు 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదు.
అధికారుల కసరత్తు
ఆరు నెలలుగా రేషన్ తీసుకోని కార్డులను రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త వారికి కార్డులిస్తే 2,10,823 మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు సూచించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తున్నారు. అందులో అర్హులైనవారికి, ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నూతన దంపతులకు కొత్త కార్డులు ఇవ్వాలంటే ముందుగా వారి కుటుంబ రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. కొత్త కార్డుల జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications