తిరుమల శ్రీవారి సన్నిధిలో యువత మద్యం వీడియోలపై ఏపీ ప్రభుత్వం తేల్చిందిదే!
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువుతీరిన తిరుమల శ్రీవారి సన్నిధిలో కొంతమంది మద్యం తాగుతూ రెచ్చిపోయారు అని, పవిత్రమైన ప్రదేశంలో కొంతమంది యువకులు పాడు పని చేశారని వార్తలు గుప్పుమన్నాయి. టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి తెలియకుండా కొంతమంది కొండపైకి మద్యం, మాంసాలను తీసుకువెళుతున్నారు అని ప్రచారం జరుగుతుంది.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఏపీ ప్రభుత్వం
అన్యమత ప్రచారం కూడా చేస్తున్నారని, కొంతమంది భక్తులు చెప్పులు వేసుకుని వస్తున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తిరుమల శ్రీవారి ఆలయం పైన కొనసాగుతున్న వివాదం అందరికీ తెలిసిందే.ఇక తాజాగా దీనిపైన ఏపీ ప్రభుత్వం స్పందించింది. రోజురోజుకు దిగజారుతున్న తిరుమల ప్రతిష్ట, శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్న మందుబాబులు, మద్యం తాగేసి బాటిల్స్ ను మెట్లపై విసురుతున్న మందుబాబులు అన్న పోస్టులు ఫేక్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వం స్పందించింది.

జరిగింది తిరుమలలో కాదన్న ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా దీనిపైన స్పందిస్తూ తిరుమల శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్నారని, తిరుమల ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతోందని పేర్కొంటూ కొందరు ఒక వీడియోని ప్రచారం చేస్తున్నారు. కానీ వీడియోలోని పరిసరాలను చూస్తే అది జరిగింది తిరుమలలో కాదు. తిరుపతిలో పాదచారులు మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి ప్రారంభమయ్యే దారి వద్ద ఉన్న ఫుట్ పాత్ పై జరిగింది అని పేర్కొంది.
క్లారిటీ ఇచ్చిన FactCheck.AP.Gov.in
దీన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా చిత్రీకరించి, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనే దురాలోచనతో సామాజిక మాధ్యమాల్లో కావాలనే పోస్ట్ చేస్తున్నారు అని వెల్లడించింది. వారిపై ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది అనిFactCheck.AP.Gov.in అనే అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
తిరుమల శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్నారని... తిరుమల ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతోందని పేర్కొంటూ కొందరు ఒక వీడియోని ప్రచారం చేస్తున్నారు. వీడియోలోని పరిసరాలను చూస్తే అది జరిగింది తిరుమలలో కాదు. తిరుపతిలో పాదచారులు మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి ప్రారంభమయ్యే దారి వద్ద ఉన్న… pic.twitter.com/Tqy7dk96OU
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) June 9, 2025
ఫేక్ ప్రచారాలను నమ్మొద్దని చెప్పిన ఏపీ ప్రభుత్వం
భక్తులెవరూ ఇటువంటి కుట్రపూరిత ఫేక్ ప్రచారాలను నమ్మొద్దు అని విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం కలగకుండా ఎప్పటికప్పుడు తాము చర్యలను తీసుకుంటున్నట్టు, టిటిడి ఆ పని చేస్తున్నట్టు పేర్కొంది.మరి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వటంతో అయినా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications