ఏపీ ఉద్యోగ సంఘాల ఉద్యమం - ప్రభుత్వం నుంచి పిలుపు..!!
ఏపీలో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. సమస్యల పరిష్కారం కోసం కొంత కాలంగా ఆందోళన బాట పట్టిన సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ రోజు (గురువారం) ఏపీ జేఏసీ అమరావతి నేతలతో సీఎస్ జవహర్ రెడ్డి చర్చలు జరపనున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ అమరావతి 10 రోజుల డెడ్‌లైన్ విధించింది. పోరాటం కొనసాగింపులో భాగంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం అందింది.
చర్చలకు ఆహ్వానం:ఉద్యోగులతో చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మరి కాసేపట్లో ఏపీ జేఏసీ అమరావతి నేతలతో సీఎస్ జవహర్ రెడ్డి చర్చలు జరుపనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ఒక రోజు నిరాహారదీక్ష సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ అమరావతి 10 రోజుల డెడ్‌లైన్ విధించింది. ఏఐటీయూసీ, సీఐటీయూసీ వంటి కార్మిక సంఘాలు సైతం ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ఏపీజేఏసీ అమరావతి నేతలతో చీఫ్ సెక్రటరీ చర్చలకు పిలవటం ఇది మూడవసారి. ఏపీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం జేఏసీ దశలవారీ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. ఈ రోజు చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

ప్రధాన డిమాండ్లపై చర్చ:ఉద్యోగుల జేఏసీ తమ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 50 పేజీల మెమోరాండం సమర్పించింది. 84 రోజులుగా దశల వారగా ఆందోళన కొనసాగిస్తోంది. ప్రస్తుతం మూడో దశ ఉద్యమం కొనసాగుతోంది. గుంటూరులో జూన్ 8న ఏపీ జేఏసీ అమరావతి ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. సదస్సుకు సంబందించిన పోస్టర్లను బొప్పరాజు ఆవిష్కరించారు. ఇక తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ ఆధ్వర్యంలో 84 రోజులుగా ఉద్యమిస్తున్నామని బొప్పరాజు వెల్లడించారు. తమ ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చిందని బొప్పరాజు వెల్లడించారు.
పరిష్కారం దిశగా :అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రధాన డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదని ఉద్యోగ సంఘా నేతలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలను సీఎస్ తో చర్చలు చేయనున్నారు. విజయవాడలోనీ సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఈ చర్చలు జరగనున్నాయి. ఇందులో ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటుగా ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించిన అంశాలను వివరించే అవకాశం ఉంది. దీంతో పాటుగా పెండింగ్ అంశాల పైన ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయనున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్న ప్రధాన డిమాండ్ల పైన ఈ సమావేశంలో చర్చించి..ఒక స్పష్టత ఇస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో, ఇప్పుడు సీఎస్ తో ఉద్యోగ సంఘాల చర్చల్లో కీలక ప్రతిపాదనలు ఉండే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications