గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలకు సర్కార్ అలర్ట్..!
గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం (ap govt)తెలిపింది. పరిస్థితులకు తగ్గట్టుగా తక్షణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ ప్రకటించారు. స్థానిక అధికారులకు అందుబాటులో ఉంటూ, అధికారిక మీడియా సమాచారాన్ని ఫాలో కావాలని గల్ఫ్ దేశాల్లో ఏపీ వాసుల్ని ఆయన కోరారు. ఆయా దేశాల్లో ఉంటున్న విద్యార్ధులు, ఉద్యోగులు, పర్యాటకులు సహా ఇతర రాష్ట్ర పౌరులు ఎవరూ కూడా, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.
సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సంయమనం పాటించాలని, త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని మంత్రి కొండపల్లి తెలిపారు. ఇండియన్ ఎంబసీలో ఆయా దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులు అందరూ నమోదు చేసుకోవాలని మంత్రి కొండపల్లి కోరారు. ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, కావున సరైన సమాచారం తెలుసుకుని, ఎప్పటికప్పుడు ఇండియన్ ఎంబసీలకు అందుబాటులో ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గగనతలంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా విమానాల రవాణా ఆలస్యం అవుతోందని, త్వరలోనే విమానయాన సేవలు పునరుద్దరిస్తారని మంత్రి తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని రాష్ట్ర పౌరులను మంత్రి కోరారు.

సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇస్తున్న ఆదేశాలు, సూచనల మేరకు, ఎప్పటికప్పుడు ప్రభుత్వం విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతోందన్నారు.ప్రభావిత దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులు అందరినీ కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అత్యవసర పరిస్థితులలో ఏపీ ఎన్నార్టీ హెల్ప్ లైన్ నెంబర్లు +91 8500027678, +91 0863 2340678 నంబర్లకు, మరింత సమాచారం కోసం https://apnrts.ap.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు. ఏ విధమైన తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా, స్థానిక అధికారులు, అధికారిక మీడియా ప్రకటనల సమాచారం మాత్రమే ఫాలో కావాలని మంత్రి గల్ఫ్ దేశాల్లో మన పౌరుల్న కోరారు.












Click it and Unblock the Notifications