మందుబాబులకు బంపరాఫర్ - ప్రభుత్వ తాజా నిర్ణయంతో..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాల పైన కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి రాగానే ప్రభుత్వం నూతన మద్యం పాలసీ అమల్లోకి తెచ్చింది. బ్రాండెడ్ మద్యం అమ్మకాలను తిరిగి మార్కెట్ లో మొదలయ్యాయి. రూ 99 కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి వచ్చింది. ఇక, కొత్త బార్ల పాలసీ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం తాజా గా తీసుకున్న నిర్ణయం మందుబాబులకు కిక్ ఇవ్వనుంది.
ఫీజుల తగ్గింపు
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో త్రీ స్టార్ సహా ఆపై స్థాయి హోటళ్లలో వార్షిక బార్ లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని ప్రభుత్వం భారీగా తగ్గించింది. రూ.66.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ హోటల్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఫీజును తగ్గిస్తూ ఆదేశాలిచ్చింది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తగ్గించిన ఫీజులు అమల్లోకి రానున్నాయి. పర్యాటకంతో పాటు ఆతిథ్యరంగానికి ఊతమిచ్చేలా త్రీస్టార్ హోటళ్లు ఆ పై స్థాయి హోటళ్లలో బార్ల వార్షిక రిజిస్ట్రేషన్ ఛార్జి, లైసెన్సు ఫీజులను తగ్గిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏడాదికి లైసెన్సు ఫీజును రూ.5 లక్షల మేర, నాన్ రిఫండబుల్ ఛార్జీ రూ. 20 లక్షల మేర నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వానికి వినతులు
ప్రస్తుతం అమలు చేస్తున్న లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువగా ఉన్నట్టు ఏపీ హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. పర్యాటకంగా వృద్ధి చేందేందుకు అవకాశాలు, పెట్టుబడి అవకాశాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫుట్‌ఫాల్ లాంటి అవకాశాలను అందిపుచ్చుకునేలా భారీగా ఉన్న ఈ ఫీజులను, ఛార్జీలను తగ్గించాలంటూ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. వీటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వార్షిక లైసెన్సు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను రూ.25 లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు, ఫుట్ ఫాల్ పెరిగేందుకు, రిసార్టులు, హైఎండ్ హోటళ్లకు ప్రోత్సాహం కల్పిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
తాజా ఉత్తర్వులలో
స్థానిక జనాభాతో సంబంధం లేకుండానే స్టార్ హోటళ్లు ఉన్నచోట ఈ లైసెన్సు ఫీజు, ఛార్జీలు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. స్టార్ హోటళ్లు ఉన్న చోట బార్ లైసెన్సుల జారీకి సంఖ్యాపరంగా ఎలాంటి నియంత్రణా లేదని స్పష్టం చేసింది. 2025 సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అమలు తేదీకి ముందుగా బార్ ఏర్పాటు కోసం ధరఖాస్తు చేస్తే ప్రస్తుతం ఉన్న ఛార్జీలే వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఆగస్టు 31 కాలపరిమితితో గడువు ముగుస్తుందని స్పష్టం చేసింది. ఈమేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications