ఉద్యోగుల పదవీ విరమణ, పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు - ఇక పై ఇలా..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ.. పెన్షన్ పైన కొత్త మార్గదర్శ కాలు సిద్దం చేసింది. ముసాయిదా విడుదల చేసింది. దీని పైన ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కోరింది. ఉద్యోగి 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే ప్రభుత్వానికి పదవీ విరమణ చేయించే విధంగా అధికారం కల్పించే ప్రతిపాదన తీసుకొచ్చారు. ముందుగా నోటీసు, లేదంటే జీత భత్యాలు ఇచ్చి వారితో పదవీ విరమణ చేయించేలా నిబంధనలు సిద్దం చేసారు. వీటి పైన ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే అభిప్రాయాలకు అనుగుణంగా తుది ఉత్తర్వులు జారీ కానున్నాయి.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో కీలక ముసాయిదా విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల మేరకు 33 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగిని ప్రజాప్రయోజనాల దృష్ట్యా పదవీవిరమణ చేయించేలా సరికొత్త విధానాన్ని ప్రభుత్వం ముసాయిదాలో పేర్కొంది. పదవీ విరమణ వయసు రాకపోయినా... 33 ఏళ్ల సర్వీసు కాలం పూర్తి చేస్తే పదవీ విరమణ చేయించేలా నూతన సివిల్ ఏపీ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు-2026 ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. 33 ఏళ్ల పాటు సర్వీసు పూర్తి చేసుకోవటం ద్వారా ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి. ఉద్యోగి 33 ఏళ్ల సర్వీసుకు దగ్గరలో ఉంటే.. వారికి మూడునెలల ముందు నోటీసులు జారీ చేస్తారు. ఆ ఉద్యోగికి ఆ మూడు నెలలకు సమాన మైన జీతభత్యాలు చెల్లిస్తారు.

తాజా ప్రతిపాదనలు
అదే సమయంలో ఉద్యోగికి మరో వెసులుబాటు కల్పించేలా ప్రతిపాదన చేసారు. పదవీవిరమణ పింఛన్‌లో కొంత భాగం డబ్బుల్ని కమ్యుట్‌గా మార్చుకోవచ్చు. పెన్షన్ కమ్యుటేషన్ నిబంధనల ప్రకారం ఈ వెసులుబాటు కల్పించారు. కాగా, ఈ ముసాయిదాపై అభిప్రాయాలు, సూచనలు చెప్పాలని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ఈ నెల 20 లోపు ఉద్యోగ సంఘాలు లిఖితపూర్వకంగా అభిప్రాయాలు అందించాలని ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 స్థానంలో ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు-2026' తీసుకొచ్చింది. ఈ మేరకు ఈ కొత్త ముసాయిదాలో 98 పేజీలలో కొత్త నిబంధనలను వివరించారు. అయితే ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానంలో పదవీవిరమణ గరిష్ఠ సర్వీసు 33 ఏళ్ల తర్వాత చేయించే నిబంధనపై స్పష్టత లేదంటున్నారు. ఉద్యోగులు పింఛన్ కోసం కనీసం 10 సంవత్సరాలు.. గరిష్టంగా 33 ఏళ్లు సర్వీసు చేయాలి. ఈ నిబంధనను బట్టి చివరి వేతనంలో 50% పింఛన్‌గా వస్తుంది. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వ ప్రతిపాదనల పైన ఉద్యోగ సంఘాల అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications