తల్లికి వందనం, ఉచిత బస్సు అమలుపై కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలు పై కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం..తల్లికి వందనం పథకాల అమలు పైన చర్చ జరిగింది. ఈ సమయంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు.
హామీల అమలు
ఎన్నికల సమయంలో కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. వాటి అమలు దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ను రూ 4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా మంత్రివర్గంలో చర్చ జరిగింది. మహిళలకు ఇచ్చిన హామీల్లో దేన్ని ముందు అమలు చేయాలన్న అంశంపైన చర్చించారు. ఉచిత వంట గ్యాస్ పథకం, ఉచిత బస్సు సౌకర్యం రెండింట్లో ఏది ముందు అమలు చేయాలనే దాని పైన మంత్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసారు.

ఆ రెండు పథకాలపై
ఎక్కువ మంది ఉచిత వంట గ్యాస్ పథకానికే మొగ్గు చూపారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చే పథకాన్ని వచ్చే దీపావళి నుంచి అమలు చేయాలని..నాలులు నెలలకో సిలిండర్ చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. దాని తరువాత తల్లికి వందనం పథకాన్ని, ఆ తరువాత తల్లికి వందనం పథకాన్ని అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాతనే ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో, వచ్చే సంక్రాంతికి ఒక పథకం..వచ్చే ఆర్దిక సంవత్సరం నుంచి మరో పథకం అమలు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ప్రభుత్వం కసరత్తు
తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతాల్లో ఏటా రూ 15 వేలు చొప్పున ఆర్దిక సాయం అందిస్తామని నాడు కూటమి నేతలు హామీ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం మంత్రి లోకేష్ ఈ పథకం పైన అందరి అభిప్రాయాలను తీసుకొని గత ప్రభుత్వం కంటే మెరుగ్గా అమలు చేస్తామని వెల్లడించారు. దీని పైన ఇప్పటికే వైసీపీ విమర్శలు చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాలను వరుసగా అమలు దిశగా ఆలోచన మొదలు పెట్టింది. అయితే, ఆర్దిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వీటి అమలు కోసం ముహూర్తం ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications