జమిలి వేళ సీమ పై చంద్రబాబు గురి - కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రంలో జమిలి దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయి. దీంతో, ఏపీలోని కూటమి ప్రభుత్వం పాలనా పరంగా .. రాజకీయంగా వరుస నిర్ణయాలు అమలు చేస్తోంది. సంక్షేమ పథకాల
అమలు పైన ఫోకస్ చేసింది. జనవరి నుంచి మరిన్ని పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో రాయలసీమ కేంద్రంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది.
ప్రభుత్వం లేఖతో
అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన సమయంలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు పైన చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజా ఎన్నికల ప్రచార సమయంలోనూ ఈ అంశాన్ని మరోసారి స్పష్టం చేసారు. కొద్ది రోజుల క్రితం కర్నూలులోని లోకాయుక్త తో పాటుగా న్యాయ సంబంధిత కార్యాలయాలను అమరావతికి తరలిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీని పైన సీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ సమయంలో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి సునీత రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ కు లేఖ రాసారు. సీఎం కార్యాలయం నుంచి న్యాయశాఖకు వచ్చిన లేఖతో ప్రక్రియను న్యాయశాఖ మొదలుపెట్టింది.

హైకోర్టు బెంచ్
రాయలసీమ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు గా ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల కు సంబంధించి హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని న్యాయ శాఖ కార్యదర్శి తన లేఖలో కోరారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ నాలుగు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం కోర్టులో ఉన్న కేసుల్లో 1/3 ఉండాలని లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ప్రస్తుత జనాభా 4.95 కోట్లుగా ఉంది. రాయలసీమలో 1.59 కోట్ల మంది ఉన్నట్లు తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దీని ద్వారా 25 శాతం మంది రాయలసీమ జిల్లాల్లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో హైకోర్టుల బెంచ్ లు ఏర్పాటు చేసారు. సీమ ప్రాంతం నుంచి నేరుగా రాజధానికి రవాణా సౌకర్యాల అంశం ప్రస్తావనకు వచ్చింది.
కేంద్రానికి తీర్మానం
తాజా లేఖలో హైకోర్ట్‌లో ఈ రీజియన్ నుంచి వచ్చిన కేసుల్లో రెండు లేదా మూడు ఏళ్ల కంటే పెండింగ్‌లో ఉన్న వివరాలు కూడా ఇవ్వాలని కోరారు. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయశాఖ కార్యదర్శి సునీత కోరటంతో ప్రక్రియలో కీలక అడుగు ముందుకు పడింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు పైన కేంద్రానికి తీర్మానం చేసి పంపటం ద్వారా దీనికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీంతో, అమరావతి లో నిర్మాణాలు ప్రారంభం అవుతున్న సమయంలోనే సీమ ప్రాంతంలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా కసరత్తు మొదలు పెట్టటంతో పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications