గ్రామ సచివాలయంలొనే కరోనా చికిత్స - 11,789 మినీ కోవిడ్ కేర్ సెంటర్లు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనేక పధకాల నిర్వహణ... సేవల్లో ఇప్పటికే కీలకంగా మారిన గ్రామ సచివాలయాల్లో ఇక కరోనా సేవాలు అందనున్నాయి. కరోనా తీవ్రత తగ్గినా..అక్కడక్కడా పాజిటివ్ కేసులు నమోదవుతునే ఉన్నాయి. అందులో భాగంగా... ఇప్పుడు మరో కీలక సేవలకు గ్రామ సచివాలయాలు సిద్దం అవుతున్నాయి. భాగంగా వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ కేర్ సెంటర్లను గ్రామ సచివాలయాల పరిధిలోనే ఏర్పాటు చేయబోతున్నారు.

లక్షణాల తీవ్రత ఆధారంగా సేవలు
అయితే, కరోనా లక్షణాలు - తీవ్రత తక్కువగా ఉండి.. సాధారణ మందులతోనే నయమయ్యే పరిస్థితులున్నప్పుడు.. వారికి గ్రామ సచివాలయాల కోవిడ్ కేర్ సెంటర్లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కోవిడ్ సోకితే చిన్న చిన్న కుటుంబాలు, చిన్న ఇళ్లలో ఐసొలేషన్‌లో ఉండటం సాధ్యం కాదు. అందుకే గ్రామ సచివాలయాల్లోనే 5 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, మూడో వేవ్ అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఒక్కో కోవిడ్ కేంద్రంలో 4 నుంచి 5 పడకలు
రాష్ట్రవ్యాప్తంగా 11,789 గ్రామ సచివాలయాల్లో పడకలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కో కోవిడ్ కేంద్రంలో 4 నుంచి 5 పడకలు ఏర్పాటు చేస్తారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,186 మైనర్ కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ మూడో వేవ్ వస్తే ముందస్తు అంచనాలను బట్టి ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసే పడకల్లో చేరే కోవిడ్ బాధితుల ఆరోగ్య పర్యవేక్షణ ఏఎన్‌ఎంలకు అప్పగిస్తారు.

వార్డు కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహణ
నిర్వహణ బాధ్యతలు మాత్రం వార్డు సెక్రటరీ చూసుకుంటారు. భోజనం, మందులు సచివాలయ సిబ్బందే అందజేస్తారు. ఒకవేళ ఎవరికైనా కోవిడ్ తీవ్రత ఎక్కువైతే పంచాయతీ సెక్రటరీ లేదా తహసీల్దార్‌కు సమాచారం ఇస్తే.. అధికారులే దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసే కోవిడ్ కేర్ సెంటర్‌కు అవసరమైన వైద్య ఉపకరణాలను కుటుంబ సంక్షేమశాఖ అందజేస్తుంది. దీని ద్వారా.. థర్డ్ వేవ్ వచ్చినా.. కోవిడ్ లక్షణాలు ఆరంభ దశలోనే గుర్తించి చికిత్స అందించే అవకాశం ఏర్పడుతుంది.

తీవ్రత ఎక్కువగా ఉంటే ఆస్పత్రుల్లోకి
అయితే, తీవ్రత ఎక్కవగా ఉంటే ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రుల్లోనే చికిత్స అవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతం వారికి కరోనా సోకినా..ఆందోళన లేకుండా ఈ నిర్ణయాలు దోహదం చేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణక్ష్ం పైన క్షేత్ర స్థాయి నుంచి పూర్తిగా పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే జిల్లాల్లో నియమించిన సచివాలయాల జేసీలకు నివేదించనున్నారు.












Click it and Unblock the Notifications