సచివాలయాల్లో అరుదైన సేవ, స్పెషల్ క్యాంప్స్ - నాలుగు రోజులే..!!
ఏపీలో వార్డు, గ్రామ సచివాలయాల సేవలకు ప్రాధాన్యత పెరిగింది. ప్రతీ వార్డు, గ్రామంలో సచివాయాల ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్నారు. గత నెలలో జగనన్న సురక్ష ద్వారా ప్రతీ ఇంటికి వెళ్లి పథకాల అర్హత ఉండి అందని వారిని గుర్తించారు. కావాల్సిన సర్టిఫికెట్లను అందించారు. ఇప్పుడు తాజాగా సచివాయాల ద్వారా ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, నాలుగు రోజుల పాటే ఈ సేవలు అందించనున్నారు.
వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే పలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆధార్ తీసుకున్న పదేళ్ల వ్యవధిలో కనీసం ఒక్కసారైనా తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.56 కోట్ల మందికి ఇప్పటి వరకూ ఆధార్ కార్డులు ఉన్నాయి. వీరిలో సుమారు 1.49 కోట్ల మంది గత పదేళ్లలో ఒక్కసారి కూడా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోలేదని గుర్తించారు. వీరి కోసం ఏపీ సచివాలయాల ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ లో తప్పులు సరి చేయించుకోవటం కోసం అనేక మంది వేచి చూస్తున్నారు. వీరి కోసం ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో స్పెషల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. ఆగస్టు 22 నుంచి అంటే రేపట్నుంచే క్యాంప్‌లు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 22, 23, 24, 25 తేదీల్లో మొత్తం నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. ఈ మేరకు తెలియజేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్‌చార్జిలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నాలుగు రోజుల్లో ఆధార్ కు సంబంధించిన మార్పులతో పాటుగా కొత్తగా ఆధార్ తీసుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. జగనన్న సురక్ష సమయంలో అనేక మంది ఆధార్ సేవల గురించి అభ్యర్దనలు వచ్చాయి.

ఇదే సమయంలో ఆధార్ అప్ డేట్ చేసుకోవాలంటూ యూఐడీఏఐ సూచనలతో ఈ క్యాంపులు ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేలకు పైగా సచివాలయాల్లో ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో ఆధార్ సేవల కోసం నిరీక్షిస్తున్న వారు సులభంగా పూర్తి చేసుకొనే అవకాశం కలుగుతుంది. నాలుగు రోజుల పాటు ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహించి..అవసరానికి అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. దీని పైన వాలంటీర్లు అవసరమైన వారికి సమాచారం ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications