గల్లుమంది గ్లాసు.. గొల్లుమంది పర్సు: ఏపీలో కొత్త బీర్ల ధరలు... మత్తు దిగాల్సిందే..!
అమరావతి: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో అందరికంటే ఎక్కువగా బాధపడ్దది మందుబాబులే కావడం విశేషం. చుక్క మందు దొరక్క వారు పడ్డ వేదన అంతా ఇంతా కాదు. ఇక కొందరైతే మద్యం దొరక్క మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. కొందరి మానసిక ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్స్‌లో చేరారు. ఇక మే 4 తర్వాత లాక్‌డౌన్‌ను 17 వరకు పొడిగించిన కేంద్రప్రభుత్వం కొన్ని జోన్లలో షరతులు విధిస్తూ మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని చెప్పింది. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ మందుబాబులకు అటు గుడ్ న్యూస్‌తో పాటు ఇటు బ్యాడ్ న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాలు తెరవడం గుడ్ న్యూస్ అయితే 25శాతం అధికంగా ధరలు పెంచడం మందుబాబులకు మింగుడుపడటం లేదు. అయినా సరే కిక్కిచ్చే మందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నారు మద్యం ప్రియులు. అయితే ప్రభుత్వం ఏ బ్రాండ్లపై ఎంత పెంచిందో అనేదానిపై మందుబాబుల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఎంత పెంచినా సరే.. కొని తాగడమే ఉంటుంది
లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కొన్ని జోన్లలో ఆంక్షలు సడలింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలు కొన్ని జోన్లలో తెరిచేందుకు అనుమతిచ్చింది. అదే సమయంలో నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ షరతులు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వైన్ షాప్ యజమానులపై, ఇటు నిబంధనలు ఉల్లంఘించిన కస్టమర్‌పై కూడా చర్యలు తీసుకుంటుందనే స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం మద్యంపై జారీ చేసిన ప్రకటన ఒక్కింత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. మద్యం దుకాణాలు తెరుస్తూనే మద్యం రేట్లను 25 శాతం అధికంగా పెంచింది. అంతేకాదు ఏ మందు ఎంతకు అమ్మాలో రేట్లను ఫిక్స్ చేసింది. తప్పదు అనుకున్న మందుబాబులు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు.

క్వార్టర్ బాటిల్ నుంచి ఫుల్ బాటిల్ వరకు పెరిగిన ధరలు
తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రూ.120 కన్నా తక్కువగా ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ. 20 చేస్తూ దాన్ని రూ.140 చేసింది. ఇక హాఫ్ బాటిల్స్ పై రూ. 40 పెంచగా.. ఫుల్ బాటిల్స్ పై రెట్టింపుతో రూ.80 పెంచుతూ నిర్ణయించింది. ఇక రూ.120 నుంచి రూ.150 ధర ఉన్న క్వార్టర్ బాటిల్స్ పై రూ. 40 పెంచింది ప్రభుత్వం. ఇక ఈ రేంజ్‌లో ఉన్న బ్రాండ్లు హాఫ్ బాటిల్స్ పై రూ.80 పెంచగా ఫుల్ బాటిల్స్ పై రూ. 120 పెంచింది. క్వార్టర్ రూ.150కి పైగా ధర ఉన్న బ్రాండ్లపై రూ. 60 పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... ఈ బ్రాండ్స్‌లో హాఫ్ బాటిల్ పై రూ. 120, ఫుల్ బాటిల్స్ పై రూ.240 పెంచుతూ డిసైడ్ అయ్యింది. ఇక మినీ బీర్ పై రూ. 20 పెంచగా ఫుల్ బీర్ పై రూ. 30 పెంచింది.

ఇక క్లుప్తంగా పెరిగిన మద్యం ధరలు ఇలా ఉన్నాయి
బీరు ధరలు
330ml - పెరిగిన ధర 20రూ.
500/650ml - రూ.30
30000ml - రూ. 2000
50000ml- రూ.3000
రెడీ టూ డ్రింక్ 250/275ml. -రూ.30పెరుగుదల
180ml ధర రూ.120కంటే తక్కువ ఉన్న వాటిపై పెంపు
60/90ml.- రూ.10పెరుగుదల
180 ml - రూ.20పెరుగుదల
375ml - రూ.40.పెరుగుదల
750ml - రూ80.పెరుగుదల
1000ml -రూ.120పెరుగుదల
2000ml - రూ.240పెరుగుదల
180ml ధర రూ. 120 నుంచి రూ. 180 మధ్యలో ఉన్న వాటిపై పెంపు
60/90ml.- రూ.20పెరుగుదల
180 ml - రూ.40పెరుగుదల
375ml - రూ.80పెరుగుదల
750ml - రూ. 160పెరుగుదల
1000ml - రూ.240పెరుగుదల
2000ml - రూ.480పెరుగుదల
రూ.150కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై పెంపు
60/90ml.-రూ.30పెరుగుదల
180 ml - రూ. 60.పెరుగుదల
375ml - రూ.120పెరుగుదల
750ml - రూ. 240పెరుగుదల
1000ml - రూ.360పెరుగుదల
2000ml - రూ.720పెరుగుదల

ప్రభుత్వం ఖజానాకు వచ్చే రెవిన్యూ ఎంతంటే..?
మొత్తానికి రెవిన్యూ పెంచుకునేందుకు ఏపీ సర్కార్ మద్యం ధరలు పెంచాలని భావించింది. దీనివల్ల ఖజానాకు రూ.4,400 కోట్లు సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.సోమవారం నుంచి తెరుచుకోనున్న మద్యం దుకాణాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ అమ్మకాలు సాగుతాయి. రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాలని, విక్రయ వేళలను నియంత్రించాలని ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ తీర్మానించారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ఇదిలా ఉంటే దశలవారీగా రాష్ట్రంలో మద్యంపాన నిషేధం చేపడతామని ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని పలు మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ మందుబాబులు మాత్రం తమకు అమృతం దొరికిందనే భావనలో ఉన్నారు. డబ్బులు పెంచితే పెంచింది కానీ మద్యం దొరక్క నాలుక ఎండిపోయిందని చెబుతున్నారు. సాధారణంగా ఇతర విషయాల్లో నిబంధనలు పాటించని వారు మద్యం కావాలంటే ఎన్ని కఠిన నిబంధనలు విధించినా వాటిని తూచా తప్పక పాటిస్తారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.