పాడి రైతన్నకు చంద్రన్న బాసట.. రూ. 52కోట్లతో పెయ్యసాయం ప్రాజెక్ట్!
పాడిపంటలు పొంగిపొరలే దారిలో నువు పాటు పడవోయ్ అన్నాడు గురజాడ.. పాడి, పంట ఇవి రెండూ సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అటువంటి ఈ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి వ్యవసాయరంగం పైన ఆధారపడి ఉంటుంది అన్నది నిర్వివాదమైన అంశం. ఇక వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ కూడా బాగుంటేనే ఆ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు సాగుతుంది.
ఏపీలో 52 కోట్ల రూపాయల ఖర్చుతో పెయ్య సాయం
ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ కొత్త పథకంతో పాడి రైతులకు అండగా నిలవనుంది. పాడి రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాడి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడం కోసం 52 కోట్ల రూపాయల ఖర్చుతో పెయ్య సాయం కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా కేవలం ఆడ దూడలు మాత్రమే పుట్టించి పాడి రైతులకు లబ్ధి చేకూర్చాలని భావిస్తుంది.

పాడి రైతు ఆర్థిక వృద్ధి సాధించేలా ప్రాజెక్ట్
జాతీయ పాడి అభివృద్ధి మండలి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థలు కలిసి ఉమ్మడిగా చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును తొలుత ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కుప్పంలోని ప్రతి పాడి రైతు ఆర్థిక వృద్ధి సాధించేలా ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పాల ఉత్పత్తి 4.5 లక్షల లీటర్లగా ఉంది. అయితే రానున్న నాలుగు సంవత్సరాలలో పది లక్షల లీటర్లకు పాల ఉత్పత్తిని పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
ఆడ దూడలు పుట్టేలా పాడి రైతులకు సాయం
ఈ క్రమంలో ఆడ దూడలు పుడితే పాడి ఉత్పత్తి పెరుగుతుందని భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెయ్య సాయం కార్యక్రమం కోసం 52 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. దీని ద్వారా కేవలం ఆడ దూడలు మాత్రమే పుట్టేలా చర్యలను తీసుకుంటున్నారు. సహజంగా ఆడ దూడ పుడితేనే అది మళ్ళీ పాలిచ్చే పశువుగా పాడి రైతుకు ఉపయోగపడుతుంది.
పెయ్య దూడలు పుట్టేలా వీర్యం పశువులకు ఇంజెక్ట్
మగ దూడలు పుడితే అవి పాడి రైతులకు ఉపయోగపడవు. అందుకే వాటిని చిన్న వయసులోనే అమ్మేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మగ దూడల పుట్టుకను తగ్గించి ఆడ దూడలను మాత్రమే పుట్టించాలి అనే ఉద్దేశంతో ఆధునిక పద్ధతిలో, కేవలం పెయ్య దూడలను మాత్రమే పుట్టేలా కృత్రిమ వీర్యాన్ని సిద్ధం చేసి పశువులకు ఇంజెక్ట్ చేస్తున్నారు.
ఒక్కో డోసు ధర 1600 రూపాయలు..ఆడ దూడల కోసం ప్రాజెక్ట్
వీర్యంలోని క్రోమోజోముల బరువును బట్టి మగ దూడల పుట్టుకకు కారణమయ్యే క్రోమోజోములువేరుచేసి, ఆడ దూడలు మాత్రమే పుట్టేలా ఉండే క్రోమోజోములు సేకరించి, ఒక్కో డోసు ధర 1600 రూపాయలుగా నిర్ణయించి పశువులకు ఇంజెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ వీర్యాన్ని పశువులకు ఇంజెక్ట్ చేయించుకుంటున్నారు వారికి దాదాపు 90 శాతానికి పైగా పెయ్య దూడల జన్మిస్తున్నాయి.
కుప్పంలో ప్రాజెక్ట్ ప్రారంభం
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా లింగ నిర్ధారిత వీర్య సేకరణ కోసం దేశవాళీ జాతులైన సాహివాల్, hf ,జెర్సీ, జెర్సీ సంకరజాతి, గిర్ తో పాటుగా, సంకర పరిచిన హెచ్ఎఫ్ జాతి ఆవులను నిర్ధారిత వీర్యం కూడా వినియోగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే కుప్పంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా నియోజకవర్గం మొత్తం మీద పునరుత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆవులు 80 వేల వరకు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.
పెయ్య దూడలు ఎక్కువగా జన్మిస్తే పాల ఉత్పత్తి, పశు సంపద
దీంతో తొలి ఏడాదిలోనే 55 వేల పశువులకు లింగ నిర్ధారిత వీర్యం ఇవ్వాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు. నియోజకవర్గంలో పెయ్య దూడలు ఎక్కువగా జన్మిస్తే పాల ఉత్పత్తి, పశు సంపద గణనీయంగా పెరుగుతాయని, పాడి రైతులు కూడా భావిస్తున్నారు. వీరు సైతం ఈ ప్రాజెక్టు పైన ఎక్కువ ఆసక్తితో ఉన్నారు.












Click it and Unblock the Notifications